భారత కీర్తి చాటిన ప్రజ్ఞానంద
చదరంగం ఆటలో ప్రజ్ఞానంద ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తి చాటాడు. తమిళనాడులోని చెన్నైకు చెందిన 18 ఏళ్ల రమేష్‌బాబు ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన ప్రపంచకప్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా ఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో కూడా అగ్రశ్రేణి ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌కు చెమటలు పట్టించాడు. టై బ్రేక్‌లో ఒత్తిడికి గురికావడంతో ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు.
టోర్నీ ఆద్యాంతం దూకుడైన ఆటతో ఆకట్టు కున్నాడు ప్రజ్ఞానంద. కానీ ఫైనల్‌లో మాత్రం ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ముందు అతడి వ్యూహాలు ఫలించలేదు. అయినా 18 ఏళ్లకే చదరంగ ప్రపంచకప్ రన్నరప్‌గా అవతరించాడు ప్రజ్ఞానంద. ఫైనల్లో విజయం సాధించకపోయినా భారతీయులు గర్వపడేలా చేశాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత విశ్వ చదరంగ యుద్ధాల్లో మహా మహులను ఢీకొట్టగల ధీరుడు భారత్‌లో ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆకట్టుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. వచ్చే ఏడాది జరగ నున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాడు. భారత కీర్తిని ప్రపంచమంతా చాటిన ప్రజ్ఞానందపై ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. ప్రపంచ కప్‌లో ప్రశంసాయోగ్యమైన ఆటతీరును కనబరచినందుకు ప్రజ్ఞానందకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలను అందజేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అతడికి శుభాకాంక్షలు తెలిపాడు. మహింద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహింద్రా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. కాగా చంద్రయాన్-3 రాకెట్ చంద్రుడిపై అడుగుపెట్టిన రోజే ప్రజ్ఞానంద పేరు విశ్వ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఆరేళ్లకే అండర్-7 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచి ఆ తర్వాత అండర్-8, అండర్-10 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను ప్రజ్ఞానంద గెలిచాడు. ఆ తర్వాత 10 ఏళ్ల 9 నెలల వయసులో 2016లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) ఘనతను అందుకున్నాడు.
2018లో 12 ఏళ్ల 10 నెలల వయసులో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్ తర్వాత గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించిన రెండో అతి పిన్న వయస్కుడిగా, భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. తాజాగా ప్రపంచకప్ చెస్ రన్నరప్‌గా నిలిచి తొలి అతి పిన్న వయస్కుడిగా చెస్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన మాగ్నస్ కార్ల్‌సన్ రూ.91 లక్షలు సొంతం చేసుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద రూ.66 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు