ప్రకృతిని ఆరాధించడమనే మన పూర్వీకుల సంస్కృతి… ‘ప్రకృతి వందనం’ పేరుతో ప్రచారం
విలువల నిర్మాణంతోనే జాతి నిర్మాణం అనే నినాదంతో దేశవ్యాప్త సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. భారతీయ సంస్కృతి గొప్పదనమైన చెట్టు, పుట్ట, నీరు, నిప్పు లాంటి వాటిలో భగవంతుడిని చూడడం మన సంస్కారమనే విషయాన్ని నేటి తరం యువతలో పెంపొందించే లక్ష్యంతో ఆర్.ఎస్.ఎస్. ప్రకృతి వందనం కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా చిప్కో ఉద్యమం స్ఫూర్తిప్రదాత, చెట్ల సంరక్షణకు తన ప్రాణాలను అర్పించిన ధన్యజీవి బెనివాల్ బిష్ణోయ్ జాట్ అమృతాదేవి స్మృత్యర్థం ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వందనం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించడమనే మన పూర్వీకుల సంస్కృతిని గుర్తు చేస్తూ మాతృమూర్తులు, పురుషులు, యువత తమకు సమీపంలోని వృక్షాలకు పూజలు చేయడం ద్వారా ప్రకృతి పట్ల తమ విశ్వాసాన్ని, ప్రకృతి సంరక్షణ పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. చెట్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి తమ చుట్టూ ఉన్న వృక్ష సంపదను కాపాడుకుంటామని ఈ సందర్భంగా సంకల్పం చేసుకున్నారు.