క్రీడలతో సర్వాంగీణ వికాసం : కృష్ణమాచార్యులు
క్రీడలతో శరీరానికి దృఢత్వం సిద్ధిస్తుందని, బుద్ధి తీక్షణత పెరుగుతుందని శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రాంత శైక్షణిక్ ప్రముఖ్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులలో సర్వాంగీణ వికాసం జరుగుతుందని, దీని కోసమే చదువుతో పాటు శిశు మందిరాల్లో ఖేల్ ఖూద్ కార్యక్రమాలను ప్రతి యేటా నిర్వహిస్తుంటామని తెలిపారు. ఆదిలాబాద్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల కేంద్రంగా మూడు రోజుల పాటు కొనసాగిన ప్రాంత స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ సమారోప్ కార్యక్రమానికి శ్రీ సరస్వతీ విద్యాపీఠం దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఆదిలాబాద్ విభాగ్ అధ్యక్షులు భజరంగ్ అగర్వాల్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రావుల సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో విజిగీషు ప్రవృత్తి అలవడుతుందని, చురుకుదనం ఏర్పడుతుందన్నారు. క్రీడల ద్వారా విద్యార్థులు భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ప్రతి రోజు ప్రార్థనలో జగశిర మౌర బనాయే భారత్ అంటూ సరస్వతీ మాతను ప్రార్థిస్తున్నామని, మన ఆటల ద్వారా అది సాకారం కావాలని కోరారు. ఇక.. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు గోల్డ్ మెడల్స్, బహుమతులు అందజేశారు.