భవ్యంగా ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్
‘‘భారత్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి విశ్వగురువుగా అవతరించడం ప్రపంచా నికి కూడా అవసరం. ఈ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పనిచేస్తోంది. నేడు ఉన్న సూపర్ పవర్ హోదాకు, విశ్వగురు భావనకు ఎంతో తేడా ఉంది. సూపర్ పవర్ స్థానంలో ఉన్న దేశాలు పాల్పడే వివక్ష, శోషణలకు విశ్వగురు భావనలో చోటులేదు’’ అని దక్షిణ మధ్య క్షేత్ర సహ ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ అన్నారు. మే 26న జరిగిన ప్రథమ వర్ష శిక్షావర్గ సమారోప్ (ముగింపు) కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. శ్రీ విద్యావిహార ఉన్నత పాఠశాల అన్నోజీగూడాలో 20 రోజులపాటు ప్రథమవర్ష శిక్షావర్గ జరిగింది.
దేశవ్యాప్తంగా 1లక్ష స్థలాల్లో ప్రతిరోజూ 20 లక్షలకుపైగా స్వయంసేవకులు నిత్యశాఖా కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగే శిక్షవర్గాలలో లక్షల మంది శిక్షణ పొందుతుంటారని భరత్ కుమార్ అన్నారు. వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి దేశం కోసం పనిచేసే తత్వాన్ని శాఖల ద్వారా అలవరచుకుంటారని, వ్యవస్థలో మార్పు వ్యక్తులలో మార్పు ద్వారానే వస్తుందని ఆయన అన్నారు. సమాజాన్ని సంఘటిత పరిస్తే ఆ సమాజమే తన సమస్యలను తీర్చుకోగలుగు తుందని డాక్టర్జీ అన్నారని గుర్తుచేశారు. సాక్షాత్తు అంబేడ్కర్ నిరాకరించిన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లను డిమాండ్ చేస్తూ వాటిని సాధించడం కోసం ఆయన పేరునే ఉపయోగిస్తు న్నారు. అలాగే వనవాసులను మతం మారుస్తు న్నారు. మతం మారితే దేశం పట్ల నిష్ట కూడా మారిపోతుందని అన్నారు. అమెరికాలో తీవ్రవాద దాడులతో సమానమని భావించిన భ్రూణ హత్యలు, స్వలింగ వివాహాలకు సంబంధించిన చట్టాలను మన దేశంలో తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆ విధంగా వివిధ రుగ్మతలను సమాజంలో ప్రవేశపెట్టాలని చూస్తు న్నారని, ఈ ధోరణిని ప్రజానీకం ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం 34 జిల్లాల నుండి 596 మంది శిక్షావర్గాలో శిక్షణ పొందారు. 15 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగినవారు ఇందులో పాల్గొన్నారు.
సమారోప్ కార్యక్రమంలో వర్గ సర్వాధికారి శ్రీ చల్లా వివేకానంద రెడ్డితో పాటు తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి, ప్రాంత అధికారులు కూడా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, పురప్రముఖులు కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేశారు.