సమాజానికి రాజ్యాంగమే మూలస్తంభం : రాష్ట్రపతి ముర్ము
దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగానికి అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ మార్గనిర్దేశం చేశారన్నారు. మన దేశ రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పాత పార్లమెంట్ ప్రాంగణంలోని సెంట్రల్ హాలులో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఉభయ సభల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజానికి రాజ్యాంగమే మూలస్తంభమని అన్నారు. రాజ్యాంగం పవిత్ర గ్రంథమని, ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలో భాగస్వాములైన వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత వుందన్నారు. మన రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల పత్రమని, దీన్ని ఆధారంగా చేసుకొనే అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగామని రాష్ట్రపతి ముర్ము అన్నారు.