వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర న్యాయశాఖ శనివారం రాత్రి ప్రకటన ఈ మేరకు విడుదల చేసింది. ఈ బిల్లు లోక్‌సభలో బుధవారం, రాజ్యసభలో గురువారం ఆమోదం పొందింది. లోక్‌సభ బిల్లుకు ‘అనుకూలంగా’ (అవును) 288 ఓట్లతో, ‘వ్యతిరేకంగా’ (లేదు) 232 ఓట్లతో ఆమోదించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.
తరువాత గురువారం రాజ్యసభలో చర్చ అనంతరం బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. వక్ఫ్ ఆస్తుల పనితీరును మెరుగుపరచడం, సంక్లిష్టతలను పరిష్కరించడం, పారదర్శకతను నిర్ధారించడం, సాంకేతికత ఆధారిత నిర్వహణను ప్రవేశపెట్టడం లక్ష్యంగా ఈ సవరణ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అంతకు ముందు బిల్లుపై దాదాపు 6 నెలల పాటు చర్చలు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు కూడా జరిగిన సంగతి తెలిసిందే… తాజా పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లును సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, ఎఐఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లాయి.