కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన రాష్ట్రపతి ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమంలో సూర్య భగవానునికి మూడు సార్లు అర్ఘ్య ప్రదానం చేశారు. సోమవారం ఉదయమే రాష్ట్రపతి ముర్ము ప్రయాగ్ రాజ్ కి చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి స్వాగతం పలికారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడానికి ముందు ఆ ప్రదేశంలో వుండే పక్షులకు ఆహారం కూడా ఇచ్చారు. పుణ్య స్నానం తర్వాత రాష్ట్రపతి అక్షయ వట్, అలాగే హనుమంతుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. అలాగే డిజిటల్ కుంభ కేంద్రాన్ని కూడా సందర్శిస్తారని పేర్కొంది.