ఒకే ఒక్క ఫొటో…. ముచ్చెమటల్లో దాయాది పాకిస్తాన్
ఒకే ఒక్క ఫొటో… పాకిస్థాన్ కి ముచ్చెమటలు పట్టించింది. పాకిస్తాన్ అబద్ధాల పుట్ట అని, నిత్యం అబద్ధాలు, అభాండాలతోనే సంసారం చేస్తుందని మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. అయినా పాకిస్తాన్ తీరు మారదు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాఫెల్ ఫైటర్ జట్ లో 30 నిమిషాల పాటు విహరించారు. అలాగే హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ తో కలిసి ఫోటో కూడా దిగారు. ఈ ఫొటోయే పాకిస్తాన్ కి దిమ్మ తిరిగేలా చేసింది.
దాయాది పాక్ తరుచుగా సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా భారత సైన్యం గురించి తప్పుడు వాదనలు చేస్తూ, భారత్ ని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటుంది.ఆపరేషన్ సిందూర్ తర్వాత, అది భారత వైమానిక దళ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ గురించి అనేక వాదనలు చేసింది, కానీ ప్రతిసారీ దాని అబద్ధాలు బయటపడి దానికి తగిన సమాధానం లభించింది.
నిజానికి ఆపరేషన్ సిందూర్ సమయంలో పైట్ శివాంగి సింగ్ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఆ విమాన పైలట్ శివాంగి సింగ్ ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నామని పాక్ తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం దీనిని ఖండిస్తూ… శివాంగి సింగ్ భారత్ లోనే సేఫ్ గా వుందని తేల్చి చెప్పింది. ఒక్క భారతీయ విమానం కూడా కోల్పోలేదని, పైగా పాకిస్తానే తన విమానాలను కోల్పోయిందని సైన్యం ప్రకటించింది.ఈ నష్టాలలో కనీసం నాలుగు US F-16 విమానాలు, చైనీస్ JF-17 యుద్ధ విమానాలు మరియు ఒక ‘బిగ్ బర్డ్’ (వైమానిక ముందస్తు హెచ్చరిక మరియు నియంత్రణ) విమానం ఉన్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. ఇప్పుడు ఇది ప్రపంచానికి రుజువైంది. భారత రాష్ట్రపతి ముర్ముతో కలిసి శివాంగి సింగ్ తో కలిసి ఫొటో దిగారు.ఈ ఫొటోలో శివాంగి సింగ్ అత్యంత ఉత్సాహంగా, ఆత్మ విశ్వాసంతో నవ్వుతూ ఫోటో దిగారు.

శివాంగీ సింగ్ ఎవరు?
శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత మొట్ట మొదటి ఏకైక మహిళా పైలట్ గా పేరు తెచ్చుకున్నారు. శివాంగి సింగ్ 1995 మార్చి 15 న యూపీలోని వారణాసిలో జన్మించారు. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్ సీసీలో చేరారు. 2016 లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. తాను పక్షిలాగా ఆకాశంలో విహరించాలని చిన్నతనం నుంచే కలలు కన్నట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత విమాన పైలట్లను చూసి, స్ఫూర్తితో పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. 2017 లో యుద్ధ విమాన పైలట్లలో ఎంపికయ్యారు శివాంగీ. మిగ్ 21 బైసన్ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. మిగ్ ఫైటర్ జెట్లు నడిపిన అనుభవంతోనే 2020 లో రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే ఛాన్స్ సంపాదించారు. అప్పటి నుంచి అంబాలా ఎయిర్ బేస్ లోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.