దేశం కోసం ప్రార్థించినా, మన కోసం ప్రార్థించినా అనుభూతి ఒక్కటే : రాష్ట్రపతి ముర్ము
భారత రాష్ట్రపతి గురువారం అయోధ్య రాముడ్ని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవతా దర్శనం చేసుకొని, హారతి నిర్వహించారు. అలాగే శ్రీరామ యంత్ర స్థాపన, పూజాదికాలను కూడా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ ఈరోజు ఆలయ రెండవ అంతస్తులో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, మనం దేశం కోసం ప్రార్థించినా, శ్రీరాముడి కోసం ప్రార్థించినా మన భావోద్వేగాలు, అనుభూతులు ఒకటేనని అన్నారు.
శ్రీరాముడు జన్మించిన పవిత్ర నగరం అయోధ్యను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అలాగే చైత్ర శుక్ల ప్రతిపాద నాడు ఇక్కడ వుండటం తన అదృష్టమని అన్నారు. అయోధ్య ఆలయ భూమిపూజ, రామ్ లల్లా విగ్రహణ ప్రాణ ప్రతిష్ఠ, రామ దర్బార్ ప్రారంభం, ఆలయ శిఖరంపై భగవాధ్వజ ఎగరేయడం లాంటి పుణ్య కార్యాలు మన చరిత్రలో, మన సంస్కృతిలో ఓ స్వర్ణయుగమని అభివర్ణించారు.
దేశం సమ్మిళత సమాజం, అభివృద్ధి చెందిన దేశం దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రభు శ్రీరాముని ఆశీస్సులతో ఈ లక్ష్యాలను 2047 నాటికి సాధిస్తామని, బహుశ: అంత కంటే ముందుగానే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో, మన సమ్మిళిత సమాజం మరియు అభివృద్ధి చెందిన దేశం యొక్క దార్శనికత రామరాజ్య వర్ణనలో ప్రతిధ్వనిస్తుందని అన్నారు.
రామరాజ్యంలో ఎవరు దు:ఖితులుగా, నిరుపేదలుగా, నైతిక విలువలు లేని వారిగా వుండేవారే కాదని గోస్వామి తులసీదాస్ పేర్కొన్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు.ఈ సందర్భంగా, శ్రీరాముని నగరమైన అయోధ్యలో, మన దేశాన్ని ఈ విశ్వపు శిఖరాలకు తీసుకువెళ్తామని మనమందరం ప్రతిజ్ఞ చేయాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, నేటి భారతదేశం కేవలం నూతన భారతదేశం మాత్రమే కాదని, మారుతున్న భారతదేశం కూడా అని అన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలను సుమారు 158 కోట్ల మంది భక్తులు సందర్శించారని ఆయన తెలిపారు. నేటి యువతరం పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు.
ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను రాష్ట్రపతి కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయితో పాటు యూపీ, ఉత్తరాఖండ్‌లకు చెందిన పలువురు సాధువులు కూడా పాల్గొన్నారు. ఈరోజు పూజలు జరిపిన శ్రీరామ యంత్రాన్ని రెండు సంవత్సరాల క్రితం అయోధ్యకు తీసుకువచ్చారు. దీనిని కంచి కామకోటి పీఠం వారు బహుకరించారు.
రెండేళ్ల క్రితం అంటే 2024 మే 2 వ తేదీన కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత హోదాలో అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు.ప్రోటోకాల్ పరిమితుల కారణంగా ఆమె జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనలేకపోయారు.ఇవేవీ తెలుసుకోకుండా ఈ విషయంలో కొందరు అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటన్నింటికీ సమాధానంగా రాష్ట్రపతి ముర్ము అయోధ్య వెళ్లడం. అలాగే అక్కడ ప్రత్యేక పూజలు చేయడం.