ఆపరేషన్ సిందూర్ చరిత్రలోనే నిలిచిపోతుంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
స్వయం సమృద్ధ దేశంగా అవతరించే దిశలో భారత్ పయనిస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామన్న దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చాలా కాలం పాటు విదేశీయుల ఏలుబడిలో దేశం వుండిపోయిందని, స్వాతంత్రం వచ్చేనాటికి ఎంతో పేదరికంలో వుండేదన్నారు. గత 78 ఏళ్లల్లో అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని, ఇప్పుడు దూసుకెళ్తున్నామని ప్రకటించారు. 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆర్థిక రంగంలో, మన విజయాలను స్పష్టంగా చూడవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో 6.5% జీడీపీ వృద్ధి రేటుతో, భారతదేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. ఎగుమతులు పెరుగుతున్నాయి. అన్ని కీలక సూచికలు మన ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉందని చూపిస్తున్నాయి” అని రాష్ట్రపతి తెలిపారు.
“సుపరిపాలన ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుండి బయటపడటం జరిగింది. ఆదాయ అసమానత తగ్గుతోంది. ప్రాంతీయ అసమానతలు కూడా కనుమరుగవుతున్నాయి. గతంలో బలహీనమైన ఆర్థిక పనితీరుకు పేరుగాంచిన రాష్ట్రాలు , ప్రాంతాలు ఇప్పుడు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి, ముందున్న దేశాలతో పోటీపడుతున్నాయి” అని అధ్యక్షుడు ముర్ము వివరించారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదంపై భారత్ చేసిన పోరు, సాధించిన విజయం చరిత్రలోనే నిలిచిపోతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు, దేశ ఐక్యతకు ఈ పరిణామమే నిదర్శనమని, వ్యూహపరమైన స్పష్టత, సాంకేతిక సత్తాతో మన సైన్యం పనిచేసి, ఉగ్రవాదులను హతం చేసిందన్నారు. భారత్ ఎవరిపైనా దండెత్తడానికి వెళ్లదని, మన పౌరుల్ని రక్షించుకునేందుకు ఎదురుదాడిలో మాత్రం వెనుకాడేది లేదని , ఇందుకు ఆపరేషన్ సిందూరే నిదర్శనమని అన్నారు.
“గతాన్ని తిరిగి చూసుకుంటే, దేశ విభజన కలిగించిన బాధను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ రోజు మనం విభజన భయానక జ్ఞాపక దినోత్సవాన్ని జరుపుకున్నాము. విభజన కారణంగా భయంకరమైన హింస జరిగింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ రోజు, చరిత్రలో జరిగిన తప్పిదాలకు బాధితులైన వారికి మనం నివాళులు అర్పిస్తున్నాము” అని అధ్యక్షుడు ముర్ము తెలిపారు.
“భారత్ కి చెందిన శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం ఒక తరాన్ని గొప్ప కలలు కనేలా ప్రేరేపించింది. అదేవిధంగా దేశ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ‘గగన్‌యాన్’కు ఇది చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు.. నూతన ఆత్మవిశ్వాసంతో మన యువత క్రీడల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా చెస్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది” అని రాష్ట్రపతి గుర్తు చేశారు.