గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I జయంతి సందర్భంగా ఇవాళ తమిళనాడులో తిరువతిరై ఉత్సవం వైభవంగా సాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగైకొండ చోళపురం ఆలయంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ప్రధాని సాంప్రదాయ దుస్తులైన తెల్లటి ధోతి, తెల్ల చొక్కా, మెడలో ధరించే అంగవస్త్రంతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 20 నిమిషాల కచేరీలో ప్రదర్శన ఇచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజాను కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు.ఇళయ రాజా మనందరినీ శివభక్తిలో ముంచెత్తాడు. శ్రావణ మాసం అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. నేను వారణాసిని ఎంపీని. ఓం నమశ్శివాయ అంటే తనకు గగుర్పాటు వస్తుందని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చోళరాజుల పాలన గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. శ్రీలంక,ఆగ్నేయాసియా వంటి ప్రాంతాలలో దౌత్య, వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకున్నారన్నారు. ఒక రోజు కిందే తాను మాల్దీవుల పర్యటనను ముగించుకొని వచ్చానని, ఇవ్వాళ ఈ ఆలయ సందర్శనకు రావడం తన అదృష్టమని అన్నారు. మరోవైపు ఈ సందర్భంగా ప్రధాని మోదీ చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ I గౌరవార్థం ఒక స్మారక నాణెంను కూడా విడుదల చేశారు. రాజేంద్ర చోళ I (1014-1044 CE) భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన, దార్శనిక పాలకులలో ఒకరు. అతని నాయకత్వంలో, చోళ సామ్రాజ్యం దక్షిణ ఇంకా ఆగ్నేయాసియా అంతటా విస్తరించింది. తన విజయ యాత్రల తర్వాత గంగైకొండ చోళపురాన్ని సామ్రాజ్య రాజధానిగా స్థాపించాడు.