భద్రావతిలో మిలాద్ -ఉన్- నబీ ఊరేగింపు.. పాక్ అనుకూల నినాదాలు
కర్నాటకలోని భద్రావతి పట్టణంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. దీంతో కర్నాటకలో వివాదం చెలరేగింది.ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి గాంధీ సర్కిల్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై జాతీయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు ఇది విఘాతమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం హలేనగర్ పీఎస్ పరిధిలోకి వచ్చే మణిస్టాండ్ సమీపంలో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ఆగిన సమయంలో మత పరమైన పాటలను డీజే ద్వారా ప్లే చేశారు. ఇదే సమయంలో ముస్లిం యువకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. వెంటనే వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలను సాక్ష్యంగా తీసుకొని, పాక్ అనుకూల నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత వ్యతిరేక నినాదాలు బహిరంగంగా వినిపించినప్పటికీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ వీధుల్లో పాక్ అనుకూల నినాదాలను ఏమాత్రం సహించమని స్థానికులు తేల్చి చెప్పారు.”ఇది భద్రావతి, లాహోర్ కాదు” అని ఒక నివాసి అన్నారు. ఇటువంటి సంఘటనలు భారతదేశ అంతర్గత భద్రతకు తీవ్రమైన ముప్పు అని మరియు మత సామరస్యాన్ని బలహీనపరుస్తాయని పౌరులు నొక్కి చెప్పారు.