కర్నాటకలోని ఆటోమొబైల్ ఆఫీస్ లో పాక్ అనుకూల నినాదాలు.. ఇద్దరి అరెస్ట్
కర్నాటకలోని రామ్ నగర్ పట్టణంలో టొయోటా ఆటో మొబైల్ కంపెనీలోని టాయ్ లెట్ గోడలపై పాకిస్తాన్ కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, అహ్మద్ హుస్సేన్(21), సాదిక్ ని (24) అరెస్ట్ చేశారు. అయితే.. పాక్ అనుకూల నినాదాలు రాశారంటూ కంపెనీ యాజమాన్యం ఈ నెల 15 న తన నోటీసు బోర్డులో పేర్కొంది. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు వుంటాయని యాజమాన్యం హెచ్చరించింది.
ఈ కంపెనీలో యేడాదిగా కాంట్రాక్ట్ బేస్ పై పనిచేస్తున్న అహ్మద్ హుస్సేన్, సాదిక్ ఈ పాక్ అనుకూల రాతలు రాసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిని మరింత లోతుగా విచారిస్తున్నామని రాంనగర్ పోలీసులు ప్రకటించారు. వారిపై సెక్షన్ 67 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత తమ సహచరులు తమను ఎగతాళి చేశారని, అందుకే తాము పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాశామని నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే.. వాష్ రూమ్ పై రాసిన రాతలను సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.