ఇలా చేయండి.. పత్తి రైతులకు జయ శంకర్ యూనివర్సిటీ కీలక సూచనలు

నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతాంగం తమ పనుల్లో నిమగ్నమైపోతోంది. ఖరీఫ్‌ సీజన్‌కి అవసరమై విత్తనాలు తీసుకోవడానికి, ఇతర అవసరాలను తీర్చుకోవడానికి రైతులు సిద్ధమైపోయారు. దీంతో ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి? రైతాంగ యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్తి రైతులకు పలు సూచనలు చేసింది. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించింది.

1. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి.
2. గతేడాదితో పోలిస్తే పత్తి సాగు 10 లక్షల ఎకరాలు అదనం. డిమాండ్‌ నేపథ్యంలో 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు వ్యవసాయ శాఖ అందుబాటులో వుంచింది.
3.రైతులు కొన్ని చోట్ల ఒకటి, రెండు కంపెనీల విత్తనాల కోసం డిమాండ్‌ చేయడం, ఆ కంపెనీల విత్తనం మాత్రమే కావాలని అడుగుతున్నారు. కానీ యాజమాన్య పద్ధతులే దిగుబడికి కారణం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
4. గతంలో కూడా రైతులు ఇలాగే ఒకే రకమైన విత్తనాలు కావాలని కోరితే, మార్కెట్‌లో అందుబాటులో వున్న హైబ్రిడ్‌లపై విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. దిగుబడులపై అంచనా వేసింది. ఆ హైబ్రిడ్‌ల దిగుబడుల్లో పెద్దగా తేడా లేదని పరిశోధనలో తేలింది.
5. రెండు మూడేళ్లుగా అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. పొలాల్లో కూడా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఎకరాకు రెండున్నర నుంచి 3 క్వింటాళ్ల అధిక దిగుబడి వచ్చిందని పరిశోధనలో తేలింది. మొక్కల సంఖ్య పెంచడం, మొక్కకు సరాసరి 10 నుంచి 12 కాయలు ఉన్నప్పుడు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నట్లు గుర్తించారు.
7. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని, ఎరువుల యాజమాన్యం, పోషకాల యాజమాన్యంతో మంచి దిగుబడులను సాధిస్తున్నట్లు పరిశోధనలో వచ్చింది.
8. సూక్ష్మ పోషకాలను సరిదిద్ది, మేలైన చీడపీడల యాజమాన్యం పాటించడం వల్ల పత్తి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం వుంటుంది.
9. వర్షాధారంగా పత్తిని ఎవరైతే సాగు చేస్తున్నారో, ఆ రైతులు పెద్ద కాయలు వున్న హైబ్రిడ్‌ కన్నా మధ్యస్థంగా కాయలు వచ్చే హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకోవడం మంచిది.
10. నీటి వసతులు వున్న చోట, నల్ల భూములు వున్న చోట పెద్ద కాయలు వచ్చే హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకోవచ్చు.
11. భూమి తడిసి, 50 నుంచి 60 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలు విత్తుకోవాలి.
12. చెలక భూములు, తేలిక భూములు, వర్షాధార భూముల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు.
13. ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టడం వల్ల పత్తిలో మంచి దిగుబడులు సాధించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *