సేంద్రియ వ్యవసాయ నిపుణులు కమలా పూజారి కన్నుమూత
సేంద్రియ వ్యవసాయ విధానాలను స్వయంగా పాటిస్తూ, దేశ విదేశాల్లో అవగాహన కల్పించిన ఒడిశాకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి (76) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల క్రితం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన ఆమె.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కమల మృతికి ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె అసాధారణ వ్యవసాయవేత్త అని, ఒడిశాలో సేంద్రియ సాగు విస్తృతికి విశేష సేవలందించారని కొనియాడారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. కమలా పూజారి మృతి పట్ల తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు గిరిజన సముదాయాల సాధికారత కోసం ఆమె చేసిన కృషి రాబోయే సంవత్సరాల్లో గుర్తుండి పోతుందన్నారు.
‘శ్రీమతి కమల పూజారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు మరియు దేశీయ విత్తనాలను రక్షించడంలో ఆమె గణనీయమైన కృషి చేశారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఆమె చేసిన కృషి ఏళ్ల తరబడి గుర్తుండిపోతుంది. గిరిజన సముదాయాలకు సాధికారత కల్పించడంలో కూడా ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ఓం శాంతి అని రాసుకొచ్చారు. మరో వైపు 2004లో ఒడిశా ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళా రైతు అవార్డు అందుకున్నారు. ఆమె కృషికి కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది.