అలుపెరుగని పరుగుల రాణి… పీటీ ఉష

అమ్మాయిలంటే గడపదాటి బయట అడుగు పెట్టడమే కష్టమనుకునే ఆ రోజుల్లో దేశవిదేశాల్లో భారతదేశ కీర్తిని నలుమూలలా చాటి చెప్పిన క్రీడాకారిణి పీటీ ఉష.  ఇప్పటివరకు పలు వేదికలపై జరిగిన ఆసియా క్రీడల్లో 23 పతకాలను సాధించారు. పరుగు పందంలో తనదైన ముద్ర వేసుకున్న ఆమెను అందరూ ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస’్‌ గా పిలుచుకుంటారు.

పీటీ ఉష తాజాగా ఓ కీలక పదవిని చేపట్టేం దుకు సిద్ధం అవుతున్నారు. దేశంలో 95 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)కి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కాబోతున్నారు.

పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌ పీటీ ఉష

 పీటీ ఉష పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కరపరంబిల్‌ ఉష. జూన్‌ 27,1964న కేరళ రాష్ట్రంలోని కూతలి అనే గ్రామంలో జన్మించింది. చిన్నప్పుడు చాలా బక్కగా ఉండే తనకు వేగంగా నడవడం అలవాటుగా ఉండేది. ఇదే ప్రఖ్యాత కోచ్‌ ఓఎం నండియార్‌ను ఆకర్షించింది. దాంతో ఈ అమ్మాయికి మంచి శిక్షణను అందిస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారిణి అవుతుందని భావించి ఉషకి శిక్షణని అందించారు. అలా 12 సంవత్సరాల వయసులోనే తన క్రీడాజీవితాన్ని ప్రారంభించిన ఆమె పలు పోటీల్లోచక్కని ప్రతిభ కనబరిచి అనేక పతకాలను సాధించారు. పీటీ ఉష గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డులను ప్రధానం చేసింది.

ఆసియా క్రీడలతోనే ఎక్కువ గుర్తింపు

ఎన్నో పోటీల్లో విజయం సాధించిన ఆమెకు ఆసియా క్రీడలే ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చాయి. ఉష మొదటిసారి 1982 న్యూదిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు వెండి పతకాలను సాధిం చారు.

అప్పటి నుంచి 1998 వరకు వివిధ దేశాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆమె మొత్తం 23 పతకాలను సాధించి పరుగుల రాణిగా గుర్తింపు పొందారు. ఇందులో 14 బంగారు పతకాలు ఉండడం విశేషం. 1986 సియోల్లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె ఏకంగా నాలుగు బంగారు పతకాలతో పాటు, ఒక వెండి పతకాన్ని సాధిం చింది.

 1983లో ఏషియన్‌ ఛాంపి యన్‌ షిప్‌లో 400 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని సాధించింది. అయితే చివరిగా 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొని రిటైర్మెంట్‌ ప్రకటించారు. అయినప్పటికీ తనలాంటి ఇంకెందరో క్రీడాకారులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో 2002లో ‘ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ను ప్రారంభించారు. ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా ఎంతోమంది అథ్లెట్లను తీర్చి దిద్దారు. వీరిలో టింటు లూకా, జిస్నా మాథ్యూ, అబితా మేరీ మాన్యుయేల్‌ వంటి ప్రపంచ స్థాయి అథ్లెట్లు ఉన్నారు.

మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా…

భారత ఒలింపిక్‌ సంఘానికి అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం కోసం ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు నామినేషన్లు సమర్పించడానికి నవంబర్‌ 27 చివరి తేదీగా నిర్ణయించారు. అయితే అధ్యక్ష పదవి కోసం పీటీ ఉష ఒక్కరే నామినేషన్‌ వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దాంతో భారత ఒలింపిక్‌ సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష ఎన్నిక లాంఛనమైంది. ఈ క్రమంలో మహారాజా యాదవీంద్ర సింగ్‌ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి క్రీడాకారిణిగా ఉష ఘనత సాధించబోతున్నారు. అంతేకాదు ఇటీవల ఐఓఏ ఎలక్షన్‌ కమిషన్‌ ఎంపిక చేసిన ఎనిమిదిమంది అత్యుత్తమ భారత అథ్లెట్ల జాబి తాలో పీటీఉష ఒకరు కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *