పునరాగమనం

శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్‌ ఒకడు. పురందర్‌ ‌కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్‌ఖాన్‌ను పంపి మోసపూరితంగా పాల్కర్‌ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్‌ ‌కులీఖాన్‌ అని పేరు కూడా పెట్టాడు. తరువాత కులీఖాన్‌ను ఆఫ్గనిస్థాన్‌లో యుద్ధానికి పంపాడు. ఇంతలో శివాజీ ప్రాబల్యం దక్షిణ భారతమంతటా పెరుగుతుండడంతో ఆందోళన చెందిన ఔరంగజేబు అతన్ని అదుపుచేయడానికి కులీఖాన్‌ను పంపాలనుకున్నాడు. ఒకప్పటి శివాజీ అనుచరుడిగా కులీఖాన్‌కు అన్ని అనుపానులూ తెలుస్తాయని ఔరంగజేబు భావించాడు.

కులీఖాన్‌ ‌నాయకత్వంలో పెద్దసైన్యం బయలుదేరింది. తన అనుచరుడైన నేతాజీపై యుద్ధం చేయాల్సిరావడం బాధాకరమే అయినా శివాజీ అందుకు సిద్ధపడ్డాడు. కానీ ఒక రోజు రాత్రి శివాజీ శిబిరానికి వచ్చిన కులీఖాన్‌ ‌తాను నేతాజీ పాల్కర్‌గా అక్కడకు వచ్చానని, ఔరంగజేబు సేనానిగా కాదని చెప్పాడు. తనను హిందూ ధర్మంలోకి తిరిగి తీసుకుని, హిందుసామ్రాజ్య రక్షణ బాధ్యత పంచుకునే అవకాశం కలిగించమని ప్రాధేయపడ్డాడు. అతని మనసు గ్రహించిన శివాజీ శాస్త్రోక్తంగా అతనిని హిందూమతంలోకి తిరిగి తీసుకురావడమేకాక తన దగ్గరి బంధువుల అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా పునరాగమన కార్యక్రమానికి నాందిపలికాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *