రహస్యాలను పాక్ కి చేరవేస్తున్న ఇద్దరి అరెస్ట్
భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయానికి అందిస్తున్న ఇద్దర్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు మహిళ కూడా వున్నారు. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో వున్న ఓ పాక్ అధికారికి భారత ఆర్మీకి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారు.ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ వారికి సున్నితమైన సైనిక డేటాను కూడా అందజేశారని, ఈ విషయాన్ని తమ విచారణలో నిందితులే స్వయంగా ఒప్పుకున్నారని డీజీపీ వెల్లడించారు. రెండో వ్యక్తి ఈ నెట్ వర్క్ లో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు కూడా తెలిపారు.
అయితే ఈ రహస్యమైన సమాచారాన్ని చేరవేస్తున్నందుకే వీరు ఆన్ లైన్ ద్వారా లావాదేవీల చెల్లింపులు కూడా తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఈ విషయం తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ తో సంభాషిస్తుంటారని కూడా వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు వీరినుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. గూఢచర్య నెట్ వర్క్ లను తాము నిర్వీర్యం చేశామని, ఇదో పెద్ద ముందడుగు అని డీజీపీ పేర్కొన్నారు. జాతీయ భద్రతను కాపాడటంలో పంజాబ్ పోలీసులు తమ నిబద్ధతను చాటుకున్నారని ప్రకటించారు.శత్రువులను నిఘాను నిర్వీర్యం చేయడానికి, దేశ ప్రయోజనాలను కాపాడడానికే ఈ ఆపరేషన్ చేశామన్నారు.అయితే.. విచారణ మాత్రం కొనసాగుతుందని డీజీపీ ప్రకటించారు.