పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్: భారతీయ ధర్మ రక్షకురాలు
భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు, రాణులు రాజ్యాలు ఏలారు. కానీ, ప్రజల గుండెల్లో ‘తల్లి’గా నిలిచిపోయిన వారు మాత్రం కొందరే. అటువంటి వారిలో అగ్రగణ్యులు రాణి అహల్యాబాయి హోల్కర్. ఒక సాధారణ పల్లెటూరిలో పుట్టి, కష్టాలను ధైర్యంతో జయించి, రాజ్యానికే దిక్సూచిగా మారిన ఆమె జీవితం ప్రతి మహిళకు ఒక పాఠం.
రైతు బిడ్డ నుంచి మహారాణి వరకు
మహారాష్ట్రలోని చౌండి అనే చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో అహల్యాబాయి జన్మించారు. , ఆమె తండ్రి ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. ఒకసారి ఆమె గుడిలో పేదలకు అన్నదానం చేస్తుండగా, ఆమెలోని వినయం మరియు భక్తిని చూసి మాల్వా పాలకుడు మల్హర్ రావు హోల్కర్ ముచ్చటపడి, తన కోడలిగా చేసుకున్నారు. అలా ఒక సామాన్య రైతు బిడ్డ రాజభవనంలోకి అడుగుపెట్టారు.
అహల్యాబాయి జీవితం పూలపాన్పు కాదు. పెళ్లయిన కొన్నేళ్లకే భర్త యుద్ధంలో మరణించారు. భర్త మరణం ఆమెను బాగా కుంగదీసింది. ఆ సమయంలో ఆమె మామగారు “నా రాజ్యానికి నువ్వే ధైర్యం, రాజ్యాన్ని నీవే కాపాడాలి” అని బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే మామగారు, ఒకే ఒక్క కొడుకు కూడా మరణించారు. చుట్టూ మరణాలు, గుండె నిండా దుఃఖం ఉన్నా.. కృంగిపోకుండా “నా ప్రజలే నా బిడ్డలు” అని భావించి రాజ్య పాలన చేపట్టారు.
ప్రజా సంక్షేమమే ఊపిరిగా పాలన
అహల్యాబాయి పాలనను ‘రామరాజ్యం’ అని పిలుస్తారు. ఆమె ఏనాడూ రాజభోగాలను అనుభవించలేదు. ఒక సామాన్య మహిళలా జీవిస్తూ, ప్రజా సమస్యలను స్వయంగా వినేవారు. పంటలు పండించడానికి చెరువులు, కాలువలు తవ్వించారు.ఎండలో ప్రయాణించే వారి కోసం రోడ్ల వెంట చెట్లు నాటించి, మంచినీటి చలివేంద్రాలు, సత్రాలు కట్టించారు.పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేసేవారు.
ధర్మ రక్షణలో ధీరవనిత
ముస్లిం దండయాత్రల వల్ల ధ్వంసమైన హిందూ దేవాలయాలను పునర్నిర్మించడంలో ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ్, గయ, అయోధ్య వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను తన సొంత ఖర్చుతో బాగు చేయించారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపారు. అందుకే ఆమెను నేటికీ ‘పుణ్యశ్లోక’ అని భక్తితో పిలుచుకుంటారు.
రాణి అహల్యాబాయి హోల్కర్ జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే కష్టాలు ఎదురైనప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోకుండా, వాటిని ఎదిరించి నిలబడితే సమాజంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఆమె నిరూపించారు. అధికారం ఉన్నా వినయం వీడకూడదని, సంపద ఉన్నా సేవ మరువకూడదని చాటిన ఆమె చరిత్ర ప్రతి ఇంటికీ స్ఫూర్తిదాయకం.