పూరీ జగన్నాథ ఆలయ దర్శనానికి వెబ్‌సైట్ ఏదీ లేదు : దేవస్థానం ప్రకటన

శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA ) విభాగం, పూరీ దేవతామూర్తుల దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను అందిస్తూ , చెల్లింపులను తీసుకుంటూ, భక్తులను మోసం చేస్తున్న మోసపూరిత వెబ్‌సైట్‌పై పూరీ సైబర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. 12వ శతాబ్దపు అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో దర్శనం పూర్తిగా ఉచితం. ఇప్పటివరకు ఎలాంటి అడ్వాన్స్ దర్శనం బుకింగ్ లాంటి ఆన్ లైన్ సదుపాయాలు దేవస్థానం ఏర్పాటు చేయలేదని SJTA అధికారులు చెప్పారు. భక్తులెవరూ ఇలాంటి వెబ్సైట్ లను నమ్మి మోసపోవద్దని సూచించారు.
వివిధ రకాల దర్శనం కోసం రూ.50 నుంచి రూ.500 వరకు రుసుము వసూలు చేస్తూ, ఈ నకిలీ పోర్టల్ భక్తులను మోసం చేస్తుందని SJTA నివేదించింది.అంతేకాక ఈ వెబ్ సైట్ లో ఆలయ చరిత్ర, ఆచారాలు, సమయాల గురించి కల్పిత సమాచారాన్ని కూడా ఇందులో చేర్చారు. కొన్ని సైట్లు విదేశీ భక్తులను లక్ష్యంగా చేసుకుని, పూజ, దర్శన సేవలకు US డాలర్లలో ధరలను కోట్ చేస్తున్నాయని ఆరోపించారు.
SJTA చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ ఈ మోసపూరిత చర్యను ఖండిస్తూ, ఆలయంలో పూజలు చేయడానకి లేదా దర్శనానికి ఎటువంటి రుసుము వసూలు చేయట్లేదని వారు చెప్పారు. “చెల్లింపు దర్శన వ్యవస్థను ప్రోత్సహించే ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ గురించి మా దఈష్టికి వచ్చింది, ఇది నకిలీది, దేవతల దర్శనం కోసం SJTA డబ్బు వసూలు చేయదు, ఇక్కడ దర్శనం పూర్తిగా ఉచితం. ఇటువంటి మోసపూరిత వెబ్‌సైట్‌ల ద్వారా మోసపోవద్దని మేము భక్తులను కోరుతున్నాము” అని ఆయన అన్నారు. భక్తుల ప్రయోజనాలను కాపాడటానికి ఇలాంటి ఫ్రాడ్ వెబ్ సైట్ లను గుర్తించి, వాటికి కారణమైన వారిని గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పరిపాలన సైబర్ పోలీసులను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *