మరో పాక్ గూఢచారి అరెస్ట్.. విచారిస్తున్న రాజస్థాన్ ఇంటెలిజెన్స్
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు పాక్ హ్యాండ్లర్‌కు అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం అతడిని అదుపులోకి తీసుకుంది. కొన్ని నెలల పాటు విశాల్ యాదవ్ పై రహస్యంగా తాము నిఘా పెట్టి, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని రాజస్థాన్ సీఐడీ యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని రోజులుగా యాదవ్ సెల్ ఫోన్లు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే.. అసలు విషయం బయట పడిందన్నారు.
అంతేకాకుండా మరో కీలక విషయం కూడా బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రియా శర్మ అనే మహిళగా నటిస్తూ… పాకిస్తాన్ హ్యాండ్లర్ తో క్రమం తప్పకుండా సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు వెల్లడైంది. ఈ సమయంలోనే నావికాదళానికి సంబంధించిన కార్యకలాపాలు, విస్తరణతో పాటు ఇతర విషయాలు కూడా తమకు చెప్పాలని పాక్ హ్యాండ్లర్లు అన్నట్లు తెలుస్తోంది.అయితే.. ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన విషయాలు కూడా లీక్ అయినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విశాల్ యాదవ్ ఆన్ లైన్ గేమింగ్ కి బాగా బానిసైనట్లు అధికారులు తెలిపారు., ఈ అప్పులను తీర్చడానికి అతనికి చాలా డబ్బు అవసరమైందని, వీటిని భర్తీ చేసుకునేందుకు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడని పోలీసులు తెలిపారు. పాక్ తరపున గూఢచర్యం చేసినందుకు అతడికి క్రిప్టో కరెన్సీలో చెల్లింపులతో పాటు నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు నగదు బదిలీ అయ్యేదని అన్నారు.ప్రస్తుతం విశాల్ యాదవ్ కస్టడీలో వున్నాడని, పూర్తి స్థాయిలో అతడ్ని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే.. అసలు సమాచారం ఎలా లీక్ అయ్యింది, దీని వెనుక ఎవరెవరు వున్నారో కూడా కూపీ లాగుతున్నారు.