గ్రామ స్వరాజ్యం, స్వయంసమృద్ధికి సజీవ ఉదాహరణ ఈ గ్రామమే
భారత్ కి గ్రామాలే పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలా మంది దార్శనికులు ప్రయత్నాలు చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని ఓ గ్రామం గ్రామ స్వరాజ్యం అన్న దానిని సాకారం చేసుకుంది. దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. విద్య, ఆరోగ్యం మొదలు మౌలిక సదుపాయాల వరకూ అన్నింటినీ సమకూర్చుకుంది. ఈ గ్రామ విజయగాథ ఇదీ…
జైపూర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో జహోటా అనే గ్రామం వుంది. ఈ జహోటా గ్రామమే గ్రామ స్వరాజ్యం అన్న దానికి రోల్ మోడల్. అద్భుతమైన గ్రామ పరివర్తనతో అందరికీ ఆదర్శమైంది. గ్రామ స్వరాజ్యం అన్న దానికి సరైన ప్రతిబింబం ఈ గ్రామం. తన సొంత బలంతో అభివృద్ధి చెందింది.స్వావలంబన దిశగా అడుగులు వేసింది. సాధికారత సాధించింది.
ప్రభుత్వంపై గానీ, బయట వ్యక్తులపై గానీ ఈ గ్రామస్థులు ఏ రకంగానూ ఆధారపడలేదు. తమ గ్రామంలోనే ఓ గ్రామాభివృద్ధి కమిటీని వేసుకుంది. ఈ జహోటా గ్రామం కింద మూడు గ్రామ పంచాయతీలు వున్నాయి. పరిపాలనా పరంగా అధికారులు 13 వార్డులుగా ఈ జహోటాను విభజించారు. మొత్తం 7 వేల జనాభా వుంటుంది.
ఈ గ్రామంలో రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఓ బ్యాంకు, ఆరు అంగన్వాడీ కేంద్రాలు, ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోస్టాఫీస్, సహకార సమితి సంఘం వంటి ప్రజాసేవలన్నీ సుసంపన్నంగా నడుస్తున్నాయి. అలాగే ఈ గ్రామానికే సొంత విద్యుత్ గ్రిడ్, పశు వైద్యశాలతో పాటు ప్రభుత్వం నడిపే అన్నపూర్ణ వంటశాల కూడా వుంది. కేవలం 8 రూపాయలకే భోజనం అందిస్తోంది.

ఇక జహోటా గ్రామంలో అందర్నీ ఆకర్షించేది మినీ సచివాలయం. ఇది ఓ క్రియాత్మక పరిపాలనా కేంద్రం. ఇదే కేంద్రంలో ఓ బ్యాంకు కోసం అద్దెకు కూడా ఇచ్చారు. దీని ద్వారా సంవత్సరానికి 1,44,000 రూపాయలు అద్దెల కింద లభిస్తుంది. అందే విధంగా పంచాయతీ ఆధ్వర్యంలో ఐదు దుకాణాల షెట్టర్లు నిర్మించారు. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా 54 వేల రూపాయలు వస్తున్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజులు, నామినేషన్ ఛార్జీలు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి వాటి ద్వారా పంచాయతీకి దాదాపు 4,60,000 రూపాయలు వస్తున్నాయి. ఇవన్నీ గ్రామాభివృద్ధికే వెళ్తాయన్నది గమనించాలి.
వీటన్నింటికీ ముందుండి నడిపించేది ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ ప్రతాప్ సింగ్ రాథోడ్. యువకుడు, అత్యంత చైతన్యవంతుడు కూడా. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ ఆయన్ను అమితంగా ఇష్టపడతారు. గౌరవిస్తారు కూడా. ఇంత అభివృద్ధి చెందడానికి తొమ్మిది రకాల లక్ష్యాలతో ముందకు సాగాడు. ఈ పంచాయతీ ‘‘ఆత్మ నిర్భర పంచాయతీ’’ అన్న పేరుతో ప్రత్యేక అవార్డూ లభించింది.
‘‘స్వయం సమృద్ధ గ్రామంగా మారాలంటే ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక అడ్డంకులను అధిగమించాలి.స్థానికుల భాగస్వామ్యం, శిక్ష, సామూహికంగా పనిచేయడం అన్న లక్ష్యాలతో ముందుకు సాగాం. ప్రతి సవాల్ ను అవకాశంగా తీసుకొని, లక్ష్యాలను చేరుకున్నాం’’ అని సర్పంచ్ తెలిపారు. న్యాయాన్ని ఇవ్వడంలోనూ ఈ గ్రామానిది ప్రత్యేక పంథాయే. బహిరంగ చర్చలు, బహిరంగ విచారణలు మధ్యవర్తిత్వం అన్న ప్రక్రియ ద్వారా న్యాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తారు.ఇబ్బందులను పరిష్కరిస్తారు.
అయితే లక్ష్యాలు చేరుకోవడానికి, శుచి శుభ్రతకు ఎక్కువ రుసుములు వసూలు కూడా చేయరు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావడమో, తోచినంత విరాళాలివ్వడం ద్వారానో వాటర్ కూలర్లు, ఫ్యాన్లు కొంటారు. అలాగే చెట్లను నాటుతూ, వాటిని కాపాడుతూ పర్యావరణ హితానికి ప్రయత్నాలు చేస్తారు.
ఇక..ఈ జహోటా గ్రామం లింగ సమానత్వానికి కూడా ఓ అద్భుత ఉదాహరణే. విధానాల రూపకల్పన, పరిపాలనలో మహిళలు కూడా భాగస్వాములు అవుతారు. అత్యంత చురుగ్గా పాల్గొంటారు కూడా. గాంధీజీతో పాటు ఇతర ఏ గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నారో.. అవి ఈ గ్రామంలో నెరవేరుతున్నాయి.
MGNREGA మరియు CSR చొరవతో ప్రభుత్వ పథకాలతో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. సాధికారత కోసం పనిచేస్తున్నాయి. దీని ద్వారా గ్రామ వ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. ఉపాధి కూడా పెరిగింది. అలాగే ప్రతి వార్డులో బాల పంచాయతీలు, బాల సమాజాలు కూడా ఏర్పాటయ్యాయి. పిల్లలకు కూడా స్థానిక పరిపాలనలో వీలు కల్పిస్తారు. దీని ద్వారా చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయన్నది ఈ గ్రామ విధానం.
అయితే తాము స్వావలంన సాధించడానికి అడ్డంకులు లేకుండా ఏమీ సాధ్యం కాలేదని సర్పంచ్ అన్నారు. ఆర్థిక పరిమితులు, పరిమిత భూమి, సాంస్కృతిక ప్రతిఘటన అనేవి తమకు ఎదురైన ముఖ్య అడ్డంకులని తెలిపారు. అయితే తామేమీ అలాగే ఆగిపోలేదని, క్రమం తప్పకుండా సమావేశాలు, శిక్షణల ద్వారా ఆ అడ్డంకులను అధిగమించామని తెలిపారు.
అలాగే బ్రహ్మ కుమారీ సంస్థ సహకాంతో జహోటాలో ఓ రాజరుషి గోకుల్ గ్రామ్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. భారత దేశ సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా, సమగ్ర గ్రామీణ అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి పెడుతుంది.ఈ కార్యక్రమం కింద దాదాపు 50 మంది గ్రామస్థులు బ్రహ్మకుమారీల ప్రధాన కార్యాలయమైన మౌంట్ అబూకి శిక్షణ కోసం వెళ్లారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యోగా, నైతిక విలువల బోధన నేర్చుకున్నారు. తర్వాత గ్రామంలో వాటిని అమలు చేశారు.

నేటి సమాజంలో ఆలోచనలు బాగా కలుషితమయ్యాయని, వాటి నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక శిక్షణ అత్యవసరమని గ్రామస్థులు భావించారు. నిజమైన స్థిరమైన అభివృద్ధికి ఆధ్యాత్మికత కూడా ఉపయోగపడుతుందని సర్పంచ్ అన్నారు. అందుకే బ్రహ్మ కుమారీలు తమ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించారని, ‘‘రాజరాజఋషి గ్రామం’గా అభివృద్ధి చేయాలని సంకల్పించారని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ జహోటా గ్రామం గాంధీజీ గ్రామ స్వరాజ్ నమూనాను ప్రతిబింబిస్తుంది. ప్రతి వార్డులో కూడా ఈ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం కనిపిస్తుంది.గ్రామీణ భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడంలో అత్యుత్తమ కృషిని గుర్తించి, జహోటా రాష్ట్రపతి అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది.