మన ప్రజల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోం : ఆపరేషన్ సిందూర్ పై రాజ్‌నాథ్

భారత సైన్యం సత్తాకు ‘ఆపరేషన్ సిందూర్’  నిదర్శనమని, మన వీరజవాన్ల పాత్ర వెలకట్ట లేనిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారంనాడు ప్రత్యేక చర్చను రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మిలటరీ యాక్షన్‌ చేపట్టింది. దీనిపై ప్రత్యేక చర్చలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటూ, కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశామని చెప్పారు.ఆత్మరక్షణ కోసమే సైనిక చర్య తీసుకున్నామని, రెచ్చగొట్టడానికో, విస్తరణవాదంతోనే కాదన్నారు.
ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వాన్ని అడగడం ప్రతిపక్షం ముఖ్యమైన కర్తవ్యమని, కొన్ని సార్లు మన విమానాలను పాకిస్తాన్ ఎన్ని కూల్చేసిందని అడుగుతున్నారని, కానీ.. మన దళాలు పాక్ విమానాలను ఎన్నింటిని కూల్చేశారు అని మాత్రం ఎన్నడూ అడగరు. ఒకవేళ మీరు ఇదే విషయంపై ప్రశ్న వేయాలనుకుంటే మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టిన ఉగ్రవాదులను ఆపరేషన్ సిందూర్ ద్వారా మన సాయుధ దళాలు నిర్మూలించాయా? అని అడగండి. దీనికి సమాధానం అవును.. నిర్మూలించాం అని చెప్తాం’’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత భారత్ కి సంబంధించిన ఏ ముఖ్యమైన ఆస్తులూ దెబ్బతినలేదని, పాక్ దాడిని భారత దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని ప్రకటించారు. పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులు జరిగాయని, 100 కి పైగా ఉగ్రవాదులు, శిక్షకులు హతమయ్యారని పేర్కొన్నారు.
‘‘మన రక్షణ వ్యవస్థలు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పాక్ దాడిని సమర్థవతంగా తిప్పికొట్టాయి. ఈ విషయాన్ని ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నాను. పాక్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత్ కి సంబంధించిన ఏ ముఖ్యమైన ఆస్తికీ నష్టం వాటిల్లలేదు. అన్నీ భద్రంగానే వున్నాయి. పాక్ నుంచి వచ్చే ప్రతి దాడినీ భద్రతా దళాలు సమర్థవంతంగానే ఎదుర్కొన్నాయి. అత్యంత ధైర్యవంతులు మన భద్రతా దళాలు. వారిని అభినందిస్తున్నా’’ అని రాజ్ నాథ్ ప్రకటించారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన రాజ్ నాథ్
వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని బెదిరించడం వల్లే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. భారత్ పాక్ మధ్య కాల్పులు అనేవి ఎవరి ఒత్తిడి వల్లా ఆగిపోలేదని తేల్చి చెప్పారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని, ముందుగా నిర్ధారించుకున్న లక్ష్యాలు భారత భద్రతా బలగాలు పూర్తి చేసుకున్నాయని, అందుకే ఆపరేషన్ సిందూర్ ఆగిందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది నిర్దేశిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని రాజ్ నాథ్ ప్రకటించారు. ఆపరేషన్ మొత్తం 22 నిమిషాల్లో ముగిసిందని, ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. అయితే మరుసటి రోజే పాక్ డ్రోన్ దాడులతో ప్రతీకారానికి దిగిందని, దీనికి ప్రతిస్పందనగా భారత్ నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో పాటు 11 కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. ఈ కాల్పుల వల్ల పాక్ భారీ నష్టాన్ని చవిచూసిందని, ఈ పరిణామాల తర్వాతే పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిందని లోక్ సభలో వివరించారు.
వాజ్ పేయి నిర్ణయం తీసుకుంటే పాక్ సూర్యోదయం చూసేదే కాదు…
భారత్ గొప్పతనం ఏమంటే.. ఎప్పుడూ స్నేహ హస్తం చాటడమేనని పేర్కొన్నారు. 1962 లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు విపక్షాలు ఎలాంటి ప్రశ్నలు వేశాయో తెలుసుకోవాలని, ఆనాడు విపక్షాలు భారత భూభాగం, మన సైనికుల పరిస్థితి గురించి ప్రశ్నించాయని గుర్తు చేశారు. అలాగే మన సైనికుల చర్యనూ వాజ్ పేయీ ప్రశంసించారన్నారు. 1999 లో శాంతియుత పరిస్థితిని కోరుతూ వాజ్ పాయ్ లాహోర్ యాత్ర చేపట్టారని, పాక్ తో భారత్ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందని చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు గనక వాజ్ పేయీ తీవ్ర నిర్ణయం తీసుకుంటే పాక్ మరుసటి రోజు సూర్యోదయం చూసేదే కాదన్నారు. శాంతి కోరడం భారత్ రక్తంలోనే వుందని, యుద్ధాలను కోరుకోమని పునరుద్ఘాటించారు. ప్రతి విషయం మానవత్వం అన్న దానితో ముడిపడి వుంటుందని, తుపాకులు పేలితే ఎవ్వరూ మిగలని అన్నారు.
పాక్ చరిత్ర తెలుసుకోండి…
ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడే సమయంలో పాక్ చరిత్రను తెలుసుకోవాలని రాజ్ నాథ్ చురకలంటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు పాల్గొన్నారని అన్నారు. దీనిని బట్టి వారిని ఆ దేశం ఎలా పెంచి పోషిస్తుందో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. ఇప్పటి వరకైతే మనం ఏ దేశంపైనా దాడి చేయలేదని, భారత స్నేహ హస్తాన్ని పాక్ అందుకోలేకపోయిందన్నారు. మన దేశ ప్రజలను చంపుతుంటే సైన్యం చూస్తూ ఊరుకోదని రాజ్ నాథ్ తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *