రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్
భారతదేశం రక్షణ రంగంతోపాటు మరికొన్ని కీలక రంగాల్లో స్వావలంబన దిశగా వేగంగా సాగుతోంది. దీంతో ‘‘స్వ’’ అన్న ఆలోచన కూడా ప్రజల్లో వేళ్లూనుకుంటోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ సాగతుండటంతో ఇతర దేశాలను కూడా భారత్ ఆకర్షిస్తోంది. తాజాగా భారతదేశం నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్‌ఎస్‌బిఎన్) ఈ వారంలో ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం (షిప్ బిల్డింగ్ సెంటర్) నుంచి ప్రారంభించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2024 ఆగస్టు 29న రెండవ అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను జలప్రవేశం చేయించారు. మూడో అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిదమన్ వచ్చే ఏడాది జలప్రవేశం చేస్తుంది. మరో రెండు అణ్వస్త్ర జలాంతర్గాముల నిర్మాణానికి కేంద్రప్రభుత్వపు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నెల 9న ఆమోదముద్ర వేసింది.
ఎస్‌ఎస్‌బిఎన్ శ్రేణిలో నాలుగోదైన ఈ జలాంతర్గామి అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రభుత్వం వెల్లడిరచలేదు. దాన్ని ఎస్-4 అనే కోడ్‌నేమ్‌తో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వికారాబాద్ వద్ద దామగుండంలో లోఫ్రీక్వెన్సీ నేవల్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మర్నాడు (అక్టోబర్ 16) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నాలుగో జలాంతర్గామిని ప్రారంభించారు. ఈ ఎస్‌ఎస్‌బిఎన్ ప్రత్యేకత ఏమిటంటే సుమారు 75 శాతం జలాంతర్గామిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసారు. దానికి కె-4 బాలిస్టిక్ క్షిపణులు అమర్చారు. ఆ మిసైల్స్ 3500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. వాటిని వెర్టికల్ లాంచింగ్ సిస్టమ్స్‌తో ప్రయోగించవచ్చు.
ఎస్‌ఎస్‌బిఎన్ శ్రేణిలో మొదటి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్, 750 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కె-15 అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించ గలదు. దాని తర్వాతివైన రెండవ, మూడవ, నాలుగవ జలాంతర్గాముల మీద కె-4 మిసైళ్ళను ప్రత్యేకంగా అమర్చారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటి పరిధికి పరిమితులు లేవు. ఈ జలాంతర్గా ములు ఎంతకాలమైనా సముద్రంలో ఉండగలవు, ఎంత రేంజ్ ఉన్న క్షిపణులనైనా ప్రయోగించగలవు. ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాత్ ఇప్పటికే సముద్రగర్భంలో గస్తీ (డీప్-సీ పేట్రోల్) తిరుగు తున్నాయి. 2028 నాటికి రష్యా నుంచి అకులా తరగతి అణుశక్తితో నడిచే సబ్‌మెరీన్ అందుతుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆరవ డీజెల్ ఎలక్ట్రిక్ కల్వరి క్లాస్ సబ్‌మెరీన్ ఐఎన్‌ఎస్ వాగ్షీర్ జలప్రవేశం చేసే అవకాశముంది.
భారత్‌కు మూడువైపులా ఉన్న సాగర జలాల్లోని చిన్నచిన్న దేశాలను తన గుప్పెట్లో పెట్టు కుంటూ మన దేశానికి ప్రమాదకరంగా మారుతున్న చైనా వంటి దేశాల నుంచి కాపాడుకోడానికి మన రక్షణ వ్యూహంలో ఎస్‌ఎస్‌బిఎన్‌లు చాలా ప్రధానమై నవి. మన దేశం రెండు విమానవాహక నౌకలను తయారు చేసుకుంది. అయితే చైనాకు చెందిన డాంగ్‌ఫెంగ్ 21, 26 వంటి లాంగ్‌రేంజ్ మిసైళ్ళు వాటిని సులువుగా ధ్వంసం చేయగలవు. అందుకే మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కంటె న్యూక్లియర్ సబ్‌మెరీన్‌ల తయారీకి భారతప్రభుత్వం ప్రాధాన్య మిచ్చింది. వీటితో పాటు ఫ్రెంచ్ నౌకావిభాగంతో కలసి మరో మూడు అడ్వాన్స్‌డ్ డీజెల్ అటాక్ సబ్‌మెరీన్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతు న్నాయి. తద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశపు భద్రత మరింత పటిష్ఠం కానుంది.
వడోదరాలో సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభం…
దేశంలోనే ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటు లోకి వచ్చింది. గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రారంభించారు. టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. భారత్‌కు మొత్తం 56 సి-295 యుద్ధ విమానాల సరఫరాకు 2021 సెప్టెంబరులో రూ.21,935 కోట్ల మేర స్పెయిన్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ సంస్థ అందజేయనుండగా, మిగతావి వడోదర యూనిట్‌లోనే తయారవుతాయి. వడోదరలో తయారయ్యే విమానాలు భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి కూడా అవుతాయి. ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్‌లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.
సి-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరొందింది. ఈ విమానంలో 71 మంది సైనిక దళాలను, 50 పారాట్రూపర్లను ఇది చేరవేస్తుంది. ప్రస్తుత బరువైన విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధ సామాగ్రిని, సైనికులను సులభంగా తరలిస్తాయి. సుదీర్ఘకాలంగా వైమానిక దళంలో సేవలు అందిస్తోన్న ఆవ్రో-748 విమానాల స్థానంలో వీటిని ప్రవేశ పెట్టనున్నారు. కాగా, సి-295కు సంబంధించిన విడి భాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమైంది. వీటిని వడోదర యూనిట్‌కు తరలించి, అక్కడే తుది కూర్పు జరుగుతుంది. వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ప్రాజెక్ట్ ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్‌ను కూడా బలోపేతం చేయనుంది.గత దశాబ్దంలో భారత్ విమానయాన రంగంలో మంచి వృద్ధి సాధించింది. భారతదేశాన్ని ఏవియేషన్ కేంద్రంగా మార్చేందుకు కృషి జరుగుతోంది. భవిష్యత్తులో భారత్, ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడంలో వడోదరలో ఏర్పాటు చేసిన కర్మాగారం కీలక పాత్ర పోషించనుంది.
వికారాబాద్ దామగుండం దగ్గర నేవీ రాడార్ స్టేషన్‌కి అంకురార్పణ
సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో వున్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్‌కి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 2010-11లో నేవీ శాఖ నిర్ణయించింది. అయితే చివరికి 2024లో ఇది కార్యరూపం దాల్చింది. దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను నేవీ ఏర్పాటు చేస్తోంది. ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గాములతో కమ్యూనికేషన్ చేస్తారు. అలాగే రక్షణ రంగంతో పాటు రేడీయో కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ సాంకేతికతను వినియోగిస్తారు.
విశాఖ కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ వీఎల్‌ఎఫ్ రాడార్ స్టేషన్‌ను నిర్మించ బోతోంది. 2,500కోట్ల రూపాయల వ్యయంతో 2027నాటికి ఈ స్టేషన్‌ని అందుబాటులోకి తీసుకురావాలని నేవీ అధికారులు భావిస్తున్నారు. దీనిని వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ వీఎల్‌ఎఫ్ స్టేషన్ ద్వారా ఓడలు, జలాంతర్గా ములతో కమ్యూనికేషన్ చేస్తారు. వీఎల్‌ఎఫ్ రాడార్ అంటే వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ కమ్యూనికేషన్ స్టేషన్. ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో మాట్లాడటా నికి దీన్ని వాడతారు. యూఎస్, యూకే, రష్యా, నార్వే, పాకిస్తాన్, జర్మనీ, ఆస్ట్రేలియాలకు ఇలాంటి వీఎల్‌ఎఫ్ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి.