అనంతపురంలో రామాలయ రథం దగ్ధం… కేసు నమోదు
అనంతపురం జిల్లాలో అపచారం జరిగింది. కనేకల్ మండలం, హనకనహల్ లో గుర్తు తెలియని వ్యక్తులు రామాలయం రథానికి నిప్పు పెట్టారు. దుండగులు అర్ధరాత్రి రామాలయానికి వచ్చి, రథానికి నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే సగం రథం బుగ్గిపాలైంది. ఇక.. గ్రామస్థులు రథానికి నిప్పు పెట్టిన విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు. రథానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనను ఖండించారు. అసలు ఎలా జరిగిందన్న దానిపై అధికారులను అడిగితెలుసుకున్నారు. నిప్పు పెట్టి, అర్ధరాత్రి దుండగులు పారిపోయారని అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని సీఎం ఆదేశించారు.