ఏప్రిల్ 30 నాటికి అయోధ్య మందిర నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
అయోధ్య రామాలయ నిర్మాణంపై ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 30 నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి ఎల్ అండ్ టీ, టీసీఎస్ కంపెనీలు మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. మిగిలిన పనుల నిమిత్తం కంపెనీలకు చెందిన బృందాలు ఆలయం వద్ద పనులు చేస్తాయని తెలిపారు. ఇక.. మార్చి 19 వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రాముడ్ని సందర్శించుకుంటారని వెల్లడించారు.
రామాలయ నిర్మాణ కమిటీతో రెండ్రోజుల పాటు సమావేశమైన అనంతరం నృపేంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, ఆలయ నిర్మాణ పనులకు ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టెన్సీలతో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నామని, ఏప్రిల్ 30వ తేదీకి నాటికి పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఆ రోజుకు అన్ని పేపర్ వర్క్‌లతో పాటు బిల్ పేమెంట్ ప్రొసీజర్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. దాంతో ఆలయం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. రామాలయ ప్రాజెక్టుకు రూ.1,900 కోట్ల ఖర్చును అంచనా వేయగా, జీఎస్‌టీతో సహా రూ.1,600 కోట్లు ఇప్పటికే చెల్లించామని మిశ్రా వివరించారు.