గోదావరిఖనిలో హిందువుల విజయం.. ఆలయాలు పునర్నిర్మిస్తామని కలెక్టర్ హామీ
హిందువులు భారీ విజయం సాధించారు. గోదావరి ఖనిలో మున్సిపల్ అధికారులు గ్రామదేవతల ఆలయాలు కూల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో 400 మంది హిందువులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించారు. కూల్చివేసిన ఆలయాలను మళ్లీ నిర్మిస్తామని, కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హిందూ సంఘాలకు హామీ ఇచ్చారు.

గ్రామ దేవతల దేవాలయాలను మున్సిపల్ అధికారులు కూల్చేయడంతో హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కూల్చేయడానికి సరైన కారణాలే చూపించడం లేదంటూ హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. అలాగే శుక్రవారం హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వున్న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

దీంతో ఈ వివాదంపై కలెక్టర్ దృష్టి సారించారు. వెంటనే హిందూ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. “కూల్చివేసిన ఆలయాలను మళ్లీ నిర్మిస్తామని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని” కలెక్టర్ హామీ ఇచ్చారు.కలెక్టర్ ఇచ్చిన ఈ హామీతో హిందూ సంఘాల ఆందోళన తాత్కాలికంగా విరమించారు.
అసలేం జరిగిందంటే…
గోదావరి ఖనిలోని రమేష్ నగర్ కూడలిలో వున్న మైసమ్మ దేవాలయాలను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ దారుణం జరిగింది. అయితే.. అదే ప్రాంతంలో ట్రాఫిక్ కి అంతరాయంగా వున్న ముస్లిం దర్గాను మాత్రం మున్సిపల్ అధికారులు ముట్టుకోలేదు. దీనిపై స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారులు చేసిన అరాచకాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, స్థానిక హిందువులు గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేశారు. మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి, దేవాలయాలను కూల్చేయడం అత్యంత అమానుషమని, హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానపరిచారని విరుచుకుపడ్డారు. మరోవైపు మున్సిపల్ అధికారుల దాష్టీకాన్ని హిందూ ఐక్యవేదిక పక్షాన ఖండిస్తున్నామని తెలిపారు. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అదే స్థలంలో దారి మైసమ్మలను నిర్మించకపోతే, రానున్న రోజుల్లో హిందూ సమాజం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ప్రకటించారు. రామగుండంలో ఇతర మతస్తులు తమ ప్రార్థనా మందిరాలను విచ్చలవిడిగా పెట్టుకున్నారని, వాటి సంగతేంటని హిందూ ఐక్య వేదిక నాయకులు సూటిగా ప్రశ్నించారు.