‘ప్రపంచ వారసత్వం’ రామప్ప ఆలయం
కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని పూజౌలో నిర్వహిస్తున్న యునెస్కో హెరిటేజ్ కమిటీ సమా వేశాలలో ప్రపంచం వ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ పక్రియలో పాలుపంచు కొన్నారు. 17 దేశాలవారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు.
రామప్పకు వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి మన దేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయు లందరికీ గర్వకారణం.
ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కో కు నామినేట్ చేసింది.
1.ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం
2.నీటితో తేలియాడే ఇటుకలతో పురాన్ని నిర్మించడం
3.ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ రంగును కోల్పోకుండా ఉండడం.
రామప్ప దేవాలయం… ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.