పార్లమెంట్ లో రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ షో

1993లో విడుదలైన జపనీస్-ఇండియన్ యానిమేషన్ మూవీ రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ సినిమాని పార్లమెంట్‌లో ప్రదర్శించనున్నట్టు గీక్ పిక్చర్స్‌ వెల్లడించింది. ఈ షోకి పార్లమెంట్ సభ్యులు కూడా వస్తారని ప్రకటించింది. దీంతో పాటు సాంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులనూ ఆహ్వానించినట్టు తెలిపింది. పార్లమెంట్‌లో తమ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతినివ్వడంపై గీక్ పిక్చర్స్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించింది. రామాయణం ఎన్ని తరాలకైనా ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి చిత్రాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించడం నిజంగా గొప్ప విషయమని వివరించింది.

అయితే..రామాయణ..ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా యానిమేషన్ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 24వ తేదీన హిందీ, తమిళం, తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లోనూ డబ్ చేసి విడుదల చేశారు. 4K ఫార్మాట్‌లో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. AA ఫిల్మ్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాని యుగో సకో, రామ్ మోహన్, కొయిచి ససకీ డైరెక్ట్ చేశారు. మరో హైలైట్ ఏంటంటే…హిందీ రామాయణంలో రాముడిగా నటించి పేరు తెచ్చుకున్న అరుణ్ గోవిల్..ఈ సినిమా హిందీ వర్షన్‌కి డబ్బింగ్ చెప్పారు. శత్రుఘ్ను సిన్హా సినిమాకి నరేటర్‌గా తన వాయిస్ అందించారు. బాహుబలి రైటర్, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్…ఈ సినిమాకి సంబంధించిన క్రియేటివ్ అడాప్షన్ బాధ్యతలు తీసుకున్నారు. 1993లోనే రామాయణ, ది లిజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో స్క్రీనింగ్ అయింది. కాకపోతే..అప్పట్లో ఇది థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఆ తరవాత టీవీ ఛానల్స్‌లో టెలికాస్ట్ అయ్యాక ఒక్కసారిగా ఇండియాలోనూ పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఇదే సినిమాని పార్లమెంట్‌లో ప్రదర్శిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *