చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ఈ కమిటీ ప్రతి పాదించింది. దీంతో పాటు తరగతి గదుల్లోని గోడలపై రాజ్యాంగ పీఠికను స్థానిక భాషల్లో రాయాలని ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సూచించింది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ.. ఈ చరిత్రలోని పాఠ్యాంశాల్లో పలు మార్పులను ప్రతిపాదించింది.

‘‘7-12వ తరగతి విద్యార్థులకు రామాయణం, మహాభారతాలు బోధించడం అవసరమని, పాఠశాల దశలోనే విద్యార్థులు తమ దేశం కోసం వారి ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని, గర్వాన్ని పెంపొం దించుకుంటారు. వారిలో దేశభక్తి కొరవడినందున ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు దేశం విడిచి ఇతర దేశాలలో పౌరసత్వం పొందుతున్నారు. అందువల్ల, వారు తమ మూలాలను అర్థం చేసుకోవడం, దేశం, సంస్కృతి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కొన్ని విద్యా బోర్డులు విద్యార్థులకు రామాయణాన్ని బోధిస్తున్నప్పటికీ, వారు దానిని పురాణంగా బోధిస్తున్నారు. పురాణం అంటే ఏమిటి? విద్యార్థులకు ఈ ఇతిహాసాలను బోధించకపోతే విద్యావ్యవస్థ ప్రయోజనం లేదు, అది దేశ సేవ కాదు’’ అని కమిటీ ఛైర్మన్‌ సీఐ ఐజాక్‌ అన్నారు.

చరిత్ర పుస్తకాల్లో భారతీయ రాజుల పాలన మొదలైన విషయాలకు మరింత ఎక్కువగా స్థానం కల్పించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ లాంటి స్వాతంత్య్ర సమర యోధుల గురించి పాఠాలను చేర్చాలని పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగ పీఠికను రాయాలని ప్రతిపాదించింది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరు బదులు ‘భారత్‌’ అని ఉపయో గించాలని ఇటీవల ఈ కమిటీ సిఫార్సులు చేసింది.

 రాబోయే విద్యాసంవత్సరం నాటికి కొత్త NCERT పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *