ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణం
సుదీర్ఘకాలం ఎదురుచూసిన భారతీయుల కల నెరవేరింది..
ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితం కళ్ళముందు సాకారమైంది..
మహోజ్వల ఘట్టానికి అంకురార్పణ జరిగింది…
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ..
గంగా, యమునా, సరస్వతి జలాలతో పాటు దేశంలోని 11 పవిత్ర ప్రదేశాలు నుంచి తీసుకొచ్చిన మట్టిని కూడా ఈ భూమిపూజలో ఉపయోగించారు. ఆ తరువాత అక్కడే జరిగిన సభాకార్యక్రమంలో ప్రధాని మోదీ శ్రీ రామమందిర తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ అనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ భాగవత్, రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ అయోధ్య రామ మందిర నిర్మాణం భూమి పూజతోనే ‘‘ఆత్మ నిర్భర భారత్’’ కి నాంది అని అన్నారు. శతాబ్దాల కలను సాకారం చేసుకున్నామని, ఈ మహా క్రతువు కోసం ఎందరో పోరాడారు, త్యాగాలు చేశారు అని గుర్తు చేశారు. అందరినీ సమానంగా చూసే, అందరి ఉన్నతికి కారణమయ్యే ధర్మానికి శ్రీ రామచంద్రుడు సాకార రూపమని, అలాంటి ధర్మాన్ని అందరూ అనుసరించాలని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటే మన మనస్సులను అయోధ్యగా మార్చుకోవాలని అన్నారు. అన్ని దోషాలను, శతృభావాన్ని తొలగించుకుని సర్వప్రపంచపు సుఖ సంతోషాలను కాంక్షించాలని మోహన్ భాగవత్ అన్నారు.
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు మనకు నేర్పాడు. మన దేశం ఎంత శక్తివంతమైనదో అంత శాంతియుతంగా ఉండాలని ఆయన చెప్పిన నీతి, రీతి. వేల ఏండ్లుగా భారత్‌కు అవే మార్గదర్శనం చేశాయి. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడమే కాదు తదనుగుణంగా నడుచుకోవాలన్నది రాముడి మాట. ఆయనే ప్రేరణతో భారత్ ఇప్పుడు ముందుకెళుతోంది. ఆయనే మనకు కర్తవ్య పాలన బాధ్యతల నిర్వహణ నేర్పారు’’ అని అన్నారు.