ప్రవహించే నీరు, సంచరించే యోగి ఎప్పుడూ కూర్చొరు : సురేష్ సోనీ
ప్రవహించే నీరు, సంచరించే యోగి ఎప్పుడూ కూర్చొరన్న వ్యాక్యం స్వర్గీయ రంగాహరి కి సరిగ్గా అతుకుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. రంగాహరి రచనలువిస్తృతమైనవని అన్నారు.ప్రజ్ఞా ప్రవాహ్ ప్రతిష్ఠాన్, కేశవకుంజ్, కితాబ్ వాలే సంయుక్తంగా రంగాహరి రచించిన నాలుగు పుస్తకాల విడుదల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజ్ఞా ప్రవాహ్ ప్రతిష్ఠాన్ బాధ్యులు, మాజీ వీసీ బ్రజ్ కిశోర్ కుఠియాలా, JNU వీసీ శాంతిశ్రీ ధూలిపూడి పండిత్, ఢిల్లీ మంత్రి ఆశీష్ సూద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సురేష్ సోనీ మాట్లాడుతూ.. స్వర్గీయ రంగాహరి ఎల్లప్పుడూ జిజ్ఞాస స్వభావాన్ని కలిగి ఉండేవారని, మేధో సంపత్తి బాగా వున్నా.. అత్యంత నిరాడంబరంగా, సహృదయంతో మెలిగేవారన్నారు. అలాగే ఆయనకుండే సైద్ధాంతిక లోతులు, విశ్లేషణాత్మక దృష్టి ఫలితంగా అద్భుతమైన విషయాలు బయటికి వచ్చాయన్నారు.
మహా భారతం అనేది ఓ విశాల సముద్రమని, ప్రపంచంలో వున్న అన్ని పాత్రలూ మహాభారతంలోనూ వున్నాయని వివరించారు.రామాయణ, భారతాలు రెండూ ప్రస్తుతమూ మనముందున్నాయని, ప్రపంచంలోని అన్ని పాత్రలూ భారతంలో వుంటే, రామాయణం మానవ ప్రవృత్తులపై ఆధారపడి వుంటుందని, భారతం మానసిక దృక్పథాలను ఆవిష్కరిస్తుందన్నారు. భారతంలో భీష్మ పితామహుడు సైన్యాధిపతిగా వున్నంత కాలమూ యుద్ధ నియమాలు, ధర్మం సరిగ్గా పాలించబడిందని, కానీ ద్రోణుడి తర్వాతే అధర్మం ప్రారంభమైందన్నారు. అయితే ధార్మికంగా వున్నవారే యుద్ధంలో మొదట మరణిస్తారని, అధర్మంగా వున్న వారు తర్వాత మరణిస్తారని, యుద్ధ విధానాలు, లక్షణాలు అన్న విశ్లేషణ అత్యంత ముఖ్యమైనవన్నారు. ఇవి ప్రస్తుత సమాజానికి తెలియజేయాలని అభిప్రాయపడ్డారు.