సూర్యుని పండుగ రథసప్తమి

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘ శుక్ల సప్తమినాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. 1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’ 2. వైశాఖంలో అర్యముడు, 3. జ్యేష్టం-మిత్రుడు, 4. ఆషాఢం-వరుణుడు, 5. శ్రావణం – ఇంద్రుడు, 6.భాద్రపదం-వివస్వంతుడు, 7. ఆశ్వయుజం-త్వష్ణ, 8. కార్తీకం-విష్ణువు, 9. మార్గశిరం- అంశుమంతుడు, 10. పుష్యం-భగుడు, 11. మాఘం-పూషుడు, 12. ఫాల్గుణం-పర్జజన్యుడు. ఈ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

 భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ ‌హనుమాన్‌ ‌చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథంమీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు : 1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు.  వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి. రామ రావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ‘ఆదిత్య హృదయం’ ఉపదేశించినట్లు రామా యణంలో ఉంది. ఇందులో 30 శ్లోకా లున్నాయి. వీటి స్మరణవల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *