46 సంవత్సరాల తర్వాత తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. జగన్నాథుని వెలకట్టలేని సంపద ఉన్న మూడో రహస్య గది తలుపులు.. అక్కడున్న మూడు తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మేజిస్ట్రేట్‌ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాఢి, పూరీ కలెక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయిన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా..
ఉదయం 11 మంది ప్రతినిధులు ముందుగా జగన్నాథ దర్శనం చేసుకున్నారు. విమలాదేవి, మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు చేశాక.. మధ్యాహ్నం 1.28 గంటలకు శుభముహూర్తంలో భాండాగారంలోని తొలి రెండు గదులు తెరిపించారు. పురుషోత్తముని నిత్యసేవలు, పండగలు, యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామి గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడా గోపురంలో భద్రపరిచారు. లోపల ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్కపెట్టెల్లో మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటకు తీసుకొచ్చారు.

మళ్లీ తేదీ నిర్ణయిస్తాం
అనంతరం జస్టిస్‌ రథ్, పాలనాధికారి అరవింద పాఢి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ మార్గదర్శకాలు, అధ్యయన సంఘం సూచనల మేరకు రహస్య గదిని తెరిపించి పరిస్థితి సమీక్షించాం. భాండాగారం లోపల తేమ ఉంది. వాన నీరు చిమ్మిన గుర్తులు ఉన్నాయి. సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు,అల్మారాలు చూశాం. వాటిని తెరవడానికి, మరో గదికి తరలించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్పటికే చీకటి పడటంతో గదికి సీల్‌ చేయించాం. తొలి రెండు గదుల్లో ఆభరణాల తరలింపునకే ఎక్కువ సమయం పట్టింది. రహస్య గదిలోని సంపదను గర్భగుడికి చేరువలోని పూలగదికి తరలించిన తర్వాత పురావస్తుశాఖ భాండాగారం మరమ్మతులను చేపడుతుంది.

 

ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాలను మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కిస్తాం. నిబంధన ప్రకారం తొలిరోజు కార్యక్రమం చేపట్టాం. మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీక్షేత్ర పాలకవర్గం తేదీ నిర్ణయిస్తుంది. సోమవారం జగన్నాథుని బహుడా యాత్ర, 17న సున్నాభెషో వేడుకలు జరుగుతాయి. మరో తేదీ నిర్ణయించి భాండాగారం తలుపులు తెరిచి సంపద స్ట్రాంగ్‌రూంకు తరలిస్తాం. తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటుచేసిన రెండు స్ట్రాంగ్‌ రూంలకు సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. మరమ్మతులు, సంపద లెక్కింపునకు ఎన్నాళ్లు పడుతుందన్నదీ ఇప్పుడే చెప్పలేము. ఈ ప్రక్రియ వల్ల పురుషోత్తముని సేవలు, భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశాం’’ అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *