మళ్లీ తీవ్ర(మైన)వాదమా?

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌రద్దయిన తరువాత చిన్నా చితకా గొడవలున్నా, మొత్తం మీద పరిస్థితి సద్దుమణిగింది. శాంతి నెలకొంటున్నది. తీవ్రవాదులను మట్టుపెట్టడం కొనసాగుతూనేవుంది. పాకిస్తాన్‌ ‌ప్రేరిత సీమాంతర తీవ్రవాదులు నాలుగు వారాల క్రితం హిందువుల మీద సాగించిన మారణకాండ తెలిసిందే. కశ్మీరీ పండితులకు మళ్లీ వాళ్లు 1989లో విడిచివెళ్లిన ఇళ్లు, స్థలాలు అప్పజెప్పుతామన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తీవ్రవాదులు 13 మంది హిందువులను ఎంచుకుని మరీ చంపారు. కశ్మీర్‌ ‌పండిట్‌ ‌మఖన్‌లాల్‌ ‌చింద్రూను ఆయన పార్మసీలో కాల్చి చంపారు. పండిట్‌లు మళ్లీ కశ్మీర్‌కు చేరకూడదనే ఆలోచనలో తీవ్రవాదులు చేస్తున్న ప్రయత్నమిది. ఇందులో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. సుమోడ్రైవర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు షఫీ కశ్మీర్‌లో రాకపోకలను సమన్వయపరుస్తున్నందుకు అతన్ని తీవ్రవాదులు చంపారు. బిజేపీ ప్రజాప్రతినిధులను కూడా చంపుతున్నారు.  ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌ను (సిక్కు సోదరి), ఒక టీచర్‌ ‌దీపక్‌చాంద్‌ను వాళ్ల ఐడి కాడ్స్ ‌చూసి చంపారు. స్థానికేతరులను చంపుతున్నారు. ఇందుకు కారణమైన తీవ్రవాదులను కూడా సైనిక దళాలు చంపారు.

370, 35ఏ రద్దయిన తరువాత జమ్మూ కశ్మీర్‌ ‌క్రమంగా జాతీయ జీవన స్రవంతిలోకి వస్తోంది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. రాళ్లు విసిరే మూకలు క్రమంగా కనుమరుగైనాయి. భారత్‌లో మిగతాచోట్ల అమలవుతున్న చట్టపరమైన విధివాధానాలన్నీ కశ్మీరుకు వర్తింపజేస్తున్నది కేంద్రం. ఇదంతా ఇంకా పాకిస్తాన్‌ ‌మైండ్‌సెట్‌లో ఉన్న కొందరు కశ్మీరీలకు నచ్చని విషయమైంది. తాజాగా పాకిస్తాన్‌లో జరిగిన టి-20 మ్యాచ్‌లో  భారత్‌ ఓడిపోయింది.  దాని కారణం ఇండియన్‌ ‌క్రికెట్‌ ‌టీమ్‌లో ఉన్న ముస్లిం ఆటగాడు మహ్మద్‌ ‌షమీ అంటూ కొన్ని రోజులు మీడియాలో ఒక వర్గం అతనిపై విమర్శలు కురిపించింది. ఈ ప్రచారం వెనుక పాకిస్తాన్‌ ‌పాత్ర ఉన్నదనేది సత్యం. క్రికెట్‌లోనూ మతపరమైన విభజనను సృష్టించి ముస్లిం క్రికెటర్లను కూడా హీనంగా చూస్తున్నారంటూ భారత ప్రభుత్వం, ప్రజనీకంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చేలా చేసేందుకు పాకిస్తాన్‌ ‌చేసిన కుట్రయిది. మీడియాలో వచ్చిన విమర్శలు చూసి ఒవైసి వంటి నాయకులు కూడా రెచ్చిపోయారు. కాని భారతజట్టు కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లి ఈ విమర్శలను త్రిప్పికొట్టి షమీకి  సంఘీభావం ప్రకటించారు. కాని పాకిస్తాన్‌ ‌విజయానికి భారత్‌లో యూపి, జమ్మూ కశ్మీర్‌లో, రాజస్థాన్‌లో కొందరు పండుగజేసుకున్నారు. ఈ మూడు రాష్ట్రాలలో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్‌ 19 ‌కింద ఈ అరెస్టులు జరిగాయి. కశ్మీర్‌లో మెడికల్‌ ‌కళాశాల విద్యార్థులు పాకిస్థాన్‌ ‌జిందాబాద్‌ ‌నినాదాలిచ్చారు. పాకిస్తాన్‌ ‌జాతీయ గీతం పాడారు. యూఏపీఏ చట్టం క్రింద వీరిపై కేసు నమోద య్యాయి. ఇందులో  విద్యార్థులు, హస్టలు వార్డెన్లు కూడా ఉన్నారు. సెక్షను 505, 504, 153ఏ క్రింద కూడా అరెస్టులు జరిగాయి.

యూపిలో ముగ్గురు విద్యార్థులు, ఆగ్రా ఇంజనీరింగు కాలేజీ విద్యార్థులు అల్ఫాఫ్‌షేక్‌, అహమ్మద్‌వనీ, యూసఫ్‌ ‌పేరుగల ఈ ముగ్గురు ప్రధాన మంత్రి విశేష ఉపకార వేతన యోజన కింద కశ్మీర్‌ ‌నుంచీ ఆగ్రాలో చదువుకోవడానికి వచ్చారు. ఇది దేశద్రోహం. వాట్సాప్‌లలో వారు ‘భారత్‌ ‌మా దేశం కాదు. మా దేశం కశ్మీర్‌ (‌పాకిస్తాన్‌)’ అం‌టూ వ్రాశారు. అందులో బురహన్‌వానీ చిత్రం పెట్టారు. కశ్మీర్‌రులో పీఎంఓ కార్యాలయం నుంచి ఓ విభాగం ఏర్పటయింది. ఆ విభాగం ఇలా కొందరు విద్యార్థులను ఎంపిక చేసి దేశంలోని వివిధ విద్యాలయాలకు పంపుతుంది. దేశం గురించిన అవగాహన కశ్మీరు విద్యార్థులకు కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నమిది. బరేలీలో కూడా ఒక వ్యక్తిని గుర్తించారు. పాకిస్తాన్‌ ‌గృహమంత్రి విజయాన్ని ఇస్లాం విజయంగా అభివర్ణించాడు. క్రమంగా ‘క్రికెట్‌ ‌జిహాద్‌’ ‌మాట కూడా తెరపైకి వస్తున్నది. అయితే రెండు నాలుకల ధోరణిలో కొందరు నాయకులు ఆర్టికల్‌ 370 ‌రద్దు చేసి మోదీ ప్రభుత్వం ఏం సాధించిందని’ విమర్శిస్తున్నారు. అక్కడి యువత మనస్సులు గెలవాలంటున్నారు. కేసులు పెడితే అవి నిలవవంటున్నారు. నేరస్థులకు శిక్ష పడవలసిందేనని, యువతను మరింత  భారత్‌కు చేరువ తెచ్చేందుకు శిక్షణ అవసరమని జాతీయవాదులు అభిప్రాయ పడ్తున్నారు.

– తాడేపల్లి హనుమత్‌‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *