అయస్కాంతంలా భక్తులను ఆకర్షిస్తున్న అయోధ్య రాముడు

అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయోధ్య పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం ప్రథమార్థంలో 11 కోట్ల మంది భక్తులు బాల రాముడ్ని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆ శాఖ గణాంకాలను విడుదల చేసింది. దీంతో పర్యాటక రంగంలో అయోధ్య సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 2024 ప్రథమార్థంలో యూపీలో పర్యటించిన పర్యాటకుల సంఖ్య 33 కోట్లు. ఇందులో దాదాపు మూడింట ఒక వంతు మంది అయోధ్యను సందర్శించుకున్నారు. అదేవిధంగా వారణాసిని 4.61 కోట్ల మంది సందర్శించుకున్నారు.
అయోధ్యను దర్శించిన వారితో పోలిస్తే ఇది తక్కువే. ఈ విషయాన్ని యూపీ టూరిజం మంత్రి కార్యాలయం ప్రకటించింది. అయోధ్యలోని బాల రాముడి మందిరం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా హిందూ సమాజం ఈ ఆలయం కోసం ఎదురుచూస్తోంది. త్వరలో మందిర నిర్మాణం పూర్తి కానుంది. ఈ ఆలయం అటు పర్యాటకులను, భక్తులను అయస్కాంతంలా ఆకర్షిస్తోందని అధికారులు అంటున్నారు.
మరోవైపు యూపీలోని ప్రయాగ్ రాజ్, మధుర కూడా ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మారాయి. వరుసగా 4.53 కోట్ల మంది, 3.07 కోట్ల మంది సందర్శకులు సందర్శించారు. ఆధ్యాత్మిక రంగంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పవచ్చు. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టం అవుతోంది. ఇక… ఆగ్రాను 69.8 లక్షలు, లక్నోను 35 లక్షల మంది సందర్శించుకున్నారు. 2022 లో యూపీని 31.86 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ యేడాది 2024 ప్రథమార్థంలోనే దీని సంఖ్య పెరిగింది. ఈ కేంద్రాలను మరింత అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరుస్తామని అధికారులు ప్రకటించారు.
మరోవైపు ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని యోగి ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రామాయణ సర్క్యూట్ లోని శ్రింగవేర్ పూర్ ను అభివృద్ధి చేయడంపై తాజాగా దృష్టి పెట్టింది యోగి సర్కార్. 2025 లో రానున్న మహా కుంభ్ ను దృష్టిలో పెట్టుకొని, ప్రయత్నాలు ప్రారంభించింది. పార్కింగ్ సదుపాయాలు, రవాణా, రోడ్లు, పౌర సదుపాయాలు, హోటల్స్ మొదలైన వాటిపై దృష్టి సారించింది సర్కార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *