సంబంధ బాంధవ్యాలే కుటుంబ జీవన లక్ష్యం

మన కుటుంబ జీవనంలో మన పెద్దలు ఏర్పరచిన అనేక అలవాట్లు, విధి విధానాలు మన కుటుంబ బంధాలను బలోపేతం చేసేందుకే ఉద్దేశించబడ్డాయి. అన్నదమ్ములెలా ఉండాలి, తండ్రీ కొడుకులెలా ఉండాలి, తల్లీ పిల్లలు ఎలా ఉండాలి, భార్యా భర్తలెలా ఉండాలి, అత్తా మామలను ఎలా చూడాలి, వృద్ధులను ఎలా సేవించాలి, పిల్లల పట్ల పెద్దల దృక్పథం ఎలా ఉండాలి ఇలా అనేక సందర్భాలు, సమాలోచనలు మన సంస్కృతికి పట్టం కట్టాయి.

కార్తీకమాసంలో శుద్ధ తదియ నాడు వచ్చే భగినీ హస్త భోజనం అలాంటిదే. యమున తన అన్నయ్యను భోజనానికి రమ్మని పిలిచింది. ‘ఏమిటి విశేషం’ అన్నాడు. ‘ఏమీ లేదు అన్నయ్య, ప్రేమతో నాచేత్తో వడ్డిస్తే నువ్వు తిని ఎన్ని రోజులయిందో కదా!’ అంది. సరే వస్తానన్నాడు. చిన్నపుడు అన్నయ్య ఏం తినేవాడో అవన్నీ వడ్డిస్తూ అన్నయ్యకు ఆ రోజు తృప్తిగా భోజనం పెట్టింది. యముడు ఎంతో తృప్తిగా భోజనం చేశాడు. ‘ఏం వరం కావాలో’ కోరుకొమ్మ న్నాడు. యమున లోకంలో ఉన్న అన్నయ్యలు, తమ్ముళ్ళందరి కోసం ఓ వరం అడిగింది. చెల్లెలు పెట్టిన భోజనం అన్న తిన్నా, అక్కపెట్టిన భోజనం తమ్ముడుతిన్నా, అన్నయ్యకు, తమ్ముడికి అపమృత్యు దోషం లేకుండా చూడమన్నది యమున. ‘ఎంత చక్కటి వరం కోరావు తల్లీ!’ అభయమిస్తున్నానన్నాడు యముడు. అంతేకాదు అలా ప్రేమతో వడ్డించిన అక్కకు, చెల్లెల కూడా మాంగల్యానికి ప్రమాదం రాదన్నాడు.

ఆ తిథి గుర్తుపెట్టుకొని అక్క ఇంటికో, చెల్లెలు ఇంటికో ఏడాదికొకసారి వెళ్ళి భోజనం చేయడం, ప్రేమను పంచుకోడం మనం నేర్చుకోవాల్సిన సంస్కారం. అంతేకాదు యముడు కూడా వెంటనే చెల్లెల్ని తరువాత రోజు కార్తీక శుద్ధ తదియనాడు తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంతకన్నా కుటుంబాల్లో మనకు కావాలసిన తృప్తి ఏముంటుంది? కటుంబం అంటేనే ఒకరికొరుగా జీవించే విధానం. ఇదొక మానసికమైన ఐశ్వర్యం. రామాయణంలో మరీచుడిని వెదకడానికి వెళ్ళిన శ్రీరాముణ్ణి ముందే లక్ష్మణుడు హెచ్చరించాడు. ఇది రాక్షసమాయ అన్నాడు. బంగారు జింక విషయమై ఆశపడవద్దని సీతను పరోక్షంగా హెచ్చరించాడు. రామబాణం తగిలి చనిపోయిన మారీచుడు ‘హా సీతా, హా లక్ష్మణా’ అని అరిచాడు. భర్త అపదలో ఉన్నాడని భావించిన సీత వెంటనే లక్ష్మణున్ని వెళ్ళమంది. లక్ష్మణుడు అది మారీచమాయ అన్నాడు. సీత లక్ష్మణున్ని నిందించింది. అన్న కోసం నిందలు భరించి, లక్ష్మణ రేఖ గీసి వెళ్ళాడు. సీతామాతను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నమది.

లక్ష్మణుడికి రాముడితో బాటు అడవులకు వెళ్ళేముందు ఊర్మిళ కొన్ని ఆప్తవాక్యాలు చెప్పింది. ఏనాడు సీతారాముల్ని విడిచిపెట్టవద్దని చెప్పింది. రాత్రింబగళ్ళు వారికి కాపాలా కాయమంది. లక్ష్మణుడికి బదులు తాను పగలు, రాత్రి నిద్రపోతా నన్నది. అరణ్యవాసంలో లక్ష్మణున్ని ఇంటికి పంపి వేద్దామని రాముడు ప్రయత్నించాడు. కాని లక్ష్మణుడు ససేమీరా అన్నాడు. ‘ఎంతకాలం నువ్వ బతుకుంటావో అంతకాలం నీతో ఉంటా’ నన్నాడు. ప్రతి రోజూ సీతారాముల పాదాభి వందనం చేసేవాడు. తల్లితండ్రుల కంటె ఎక్కువగా అన్నా వదినల పాదసేవ చేసినవాడు. 14 ఏళ్ళ అరణ్య వాసంలో సీతమ్మ పట్టుపుట్టాలు, నగలు కావడి ఎత్తుకు మోసినవాడు. ఇవన్నీ మనకు మార్గనిర్దేశనం చేస్తాయి.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *