మతమార్పిడులను ప్రతిఘటించిన విద్యార్థులు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అక్రమ మత మార్పిళ్ల కేసు వెలుగు చూసింది. ఏకంగా చిన్నారులనే మత మార్పిళ్ల ముఠా టార్గెట్ చేసింది. తల్లిదండ్రులను ఏమార్చి, విద్యార్థులను ప్రలోభపెట్టి, పాఠశాలల దగ్గర విద్యార్థులను మతం మార్చేం దుకు రంగంలోకి దిగాయి. ఇలా పిల్లల్ని మోసం చేసి, ప్రలోభ పెట్టి, క్రైస్తవంలోకి మార్చేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాఠశాల ముగిసిన తర్వాత, బయటికి వచ్చే పిల్లలపై ఒత్తిడి తెచ్చి, చర్చికి వెళ్లాలని ఈ ముగ్గురూ అడుగుతున్నట్లు తేలింది. ఈ తంతు ప్రతిరోజూ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. చివరి బెల్ కొట్టిన తర్వాత, బయటికి వచ్చే విద్యార్థులను మాటలతో మాయ చేసి, వారితో సంభాషించి, హిందూ దేవతలపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందూ దేవతలపై వ్యతిరేకంగా రోజూ చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయం హిందూ సంఘాల దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు మహిళలపై కేసులు నమోదు చేశారు. ఇదే విషయంపై హిందూ సంఘాలు తమకు ఫిర్యాదు చేశాయని, దీంతో మతం మారమని ప్రలోభాలకు గురి చేస్తున్న ముగ్గురు మహిళల్ని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.
విద్యార్థులు చెప్పిన ప్రకారం ‘‘మా పాఠశాల చివరి బెల్ మోగిన తర్వాత మేం బయటికి వెళ్లిపోతాం. ఆ సమయంలో ఆటోలో ముగ్గురు మహిళలు వస్తారు. క్రైస్తవ మతాన్ని నమ్ముతారా? చర్చికి వెళ్తారా? లేదా? అని అడుగుతారు. తాము హిందువులమని మేం చెప్పాం. అయినా వినకుండా.. మహిళలు క్రైస్తవంలోకి మారాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. చర్చికి వెళితే తెలివిమంతు లుగా తయారవుతారని, అనారోగ్యం, వ్యాధులు వుంటే పోతాయని, ఈ విషయం మా కుటుంబీకు లకు కూడా చెప్పాలని రోజూ ఒత్తిడి తెస్తున్నారు. అయినా మేము వారి ప్రలోభాలకు గురి కాలేదు. వెంటనే హిందూ సంఘాలకు సమాచారాన్ని ఇచ్చాం.’’ అని విద్యార్థులు ప్రకటించారు.