‘‘కర్తవ్య పథ్’’ ద్వారా సైనిక పాటవాన్ని జగద్విదితం చేసిన భారత్.. హైలెట్స్ ఇవే..
భారత 77వ గణంత్ర దినోత్సవ వేడుకలు భారత దేశంలో ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవం భారత సైనిక శక్తి పాటవాన్ని సగర్వంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ముఖ్య అతిథులుగా ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, కోస్టా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. దాదాపు 10 వేల మంది ఈ రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు.
మొదటగా సంప్రదాయంగా వస్తున్న రాష్ట్రపతి భవన్ నుంచి అతిథులతో కలిసి గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్ కి చేరుకున్నారు. ఈ పరేడ్‌లో త్రివిధ దళాలకు చెందిన 6,050 సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో సాగిన ఆయుధ ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని చూపించింది.

1. ఈ వేడుకల సందర్భంగా నాలుగు ఎమ్ఐ-17 హెలికాఫ్టర్లు పూల వర్షం కురిపించాయి.
2.ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన, 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంఛర్ అతిథులను ఆకట్టుకున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు ప్రదర్శన కూడా ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది.
3. ఈ రిపబ్లిక్ డే వేడుకలకు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీశ్ కుమార్ నేతృత్వం వహించారు.
4. రెండు మూపురాలున్న ఒంటెలు, ఝన్ స్కార్ పోనీలు తొలిసారిగా పరేడ్ లో పాల్గొన్నాయి.
5. 61 కేవల్రీ సభ్యులు పోరాట దుస్తుల్లో పరేడ్ కి ముందు వచ్చారు.
6. పరేడ్ లో తొలిసారిగా రకరకాలైన స్కౌట్ యూనిట్ల కవాతకు లెఫ్టినెంట్ అమిత్ చౌదరి నాయకత్వం వహించారు. తీవ్రమైన మంచును కూడా తట్టుకొనే ప్రత్యేక దుస్తులతో వీరు అందర్నీ ఆకర్షించారు.
7. శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పరేడ్ లో పాల్గొంది.

8. భైరవ దళం తొలిసారిగా పరేడ్ లో పాల్గొంది. వేగంగా స్పందించే, భీకరమైన దాడులకు ప్రసిద్ధి.
9. నౌకాదళ, వైమానిక దళాలకు సంబంధించి 114 మంది చొప్పున యువ సిబ్బంది కవాతు చేశారు.
10. సీఆర్పీఎఫ్ కవాతుకు 26 ఏళ్ల మహిళా అధికారి సిమ్రాన్ బాల నేతృత్వం వహించి, రికార్డు నెలకొల్పారు.
11.పరేడ్ లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణ. అలాగే ఎంఆర్ శామ్ క్షిపణి, అటాగ్స్ శతఘ్ని, ధనుష్ శతఘ్ని, డ్రోన్లను కూడా ప్రదర్శించారు.
12. పరేడ్ థీమ్ గా 150 ఏళ్ల వందేమాతరాన్ని ఎంచుకున్నారు. ఇది ఈసారి విశేషత.
13. కెప్టెన్ హర్షిత రాఘవ్ నేతృత్వంలోని రెమౌంట్ వెటర్నరీ కోర్ దళం కూడా పరేడ్ లో పాల్గొంది. ఇందులో డేగలు, శునకాలు వున్నాయి.
14. భారత్‌కు అత్యంత కీలకంగా మారిన ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ప్రదర్శించారు. అపాచీ, ప్రచండ్ హెలికాఫ్టర్లు, వివిధ యుద్ధ విమానాల గగనతల విన్యాసాలు మెప్పించాయి. డ్రోన్ ప్రదర్శన కూడా పరేడ్‌లో జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కవాతులో కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
15. రిపబ్లిక్ డే పరేడ్ గ్యాలరీలకు బ్రహ్మపుత్ర, బియాస్, చంబల్, చినాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సింధు, జీలం, కావేరీ, కోసి, మహానది, యమునా, కృష్ణ, నర్మదా నదుల పేర్లను వుంచారు.
16.సైనిక కవాతుతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, కళా ప్రదర్శనలు దేశ సాంస్కృతిక వైవిధ్యతను చాటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 శకటాలు దేశ ఖ్యాతిని ఇనుడింపచేశాయి.
17. స్వాతంత్రోద్యమ సమయంలో అందరికీ మహా మంత్రంగా నిలిచిన ‘‘వందేమాతరం’’ ఇతివృత్తం అందరికీ ఆకర్షణగా నిలిచింది.