ఇంగువ నీరు జీర్ణ క్రియకి, జీవ క్రియకి చాల ఉపయోగం
మన సంప్రదాయంలో మన వంటిల్లే ఔషధాలయం. సర్వ రోగనివారిణి మన వంటిల్లే. మన ఇంట్లో వాడే ఇంగువలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా వుంచేందుకు బాగా సహకరిస్తుంది. స్వచ్ఛమైన ఇంగువను ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. ఇంగువలోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగువ నీటిని తాగితే సమస్యలు పోతాయి. ఇంగువ వాటర్ వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి.
జీర్ణక్రియకు ప్రయోజనకారి….
జీర్ణ క్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా అధిగమించడానికి ఇంగువ నీరు ఆరోగ్యకరంగా వుంటుంది. ఇంగువ జీర్ణ ఉద్దీపన ప్రభావాన్ని కలిగి వుంటుంది. లాలాజల స్రావం, ఎంజైమ్ లాలాజల అమైలేస్ వ్యవస్థను పెంచుతుంది. ఇది శరీరంలో పిత్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వాఆరా డైటరీ లిపిడ్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది.ఇంగువ నీటిని తాగడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. ఇంగువలోని లక్షణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. జీవ క్రియను పెంచడానికి, గోరు వెచ్చని నీటితో ఇంగువను తీసుకోవాలి.
బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది…
ఇంగువ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గడంలో ప్రభావవంతంగా వుంటుంది. ఇంగువలో స్థూలకాయాన్ని నిరోధించే లక్షణాలు వున్నాయి. ఇది కాకుండా ఇంగువ కొవ్వును తగ్గించే ప్రభావం కూడా కలిగి వుంటుంది. ఇక… రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.