మన పెద్దలను, పూర్వజులను, వంశజులను గౌరవించాలి

మాతృదేవోభవ, పితృదేవో భవ! అని చిన్నప్పటి నుంచే మన కుటుంబాల్లో చెబుతుంటారు. పెద్దలను గౌరవించడం, మన తాతలను, తండ్రులను స్మరించుకోవడం మన కుటుంబాలలో సహజంగా జరుగుతుంటుంది. మన ఇళ్లల్లో సంస్కారాలను మనం పెద్దల నుంచి నేర్చుకుంటాం. అందుకే పెద్దల మాట పెరుగన్నపు మూట అంటుంటారు. పెద్దలు ఏం చెప్పినా, ఏం చేసినా అందులో ఏదో పరమార్థం ఉంటుంది. అదే మన కుటుంబ వ్యవస్థ గొప్పతనం. కుటుంబం అంటేనే ఒకరికోసం ఒకరు కలసి జీవించడం. మన పెద్దలు సదాచారం పాటించారు. ధర్మాచరణ చేసేవారు. పెద్దలు తమ పిల్లల కోసం ఆలోచించేవారు ఇప్పటికీ కుటుంబంలో తల్లిదండ్రి పిల్లల బాగోగుల గురించి ఆలోచిస్తారు. పెద్ద వయసులో వారి పక్కన నిలబడి సేవచేయడం పిల్లలు తమ కర్తవ్యంగా భావించాలి.

భారత రాష్ట్రపతిగా చేసిన డా॥ అబ్దుల్‌కలామ్‌ తన పుస్తకం ‘ఓ విజేత ఆత్మకథ’ లో గోధుమలు దొరకని రెండవ ప్రపంచ యుద్ధ సమయ కాలంలో తన తల్లి గోధుమ రొట్టె తినకుండా తనకు పెట్టిందని, ఆమె ఇచ్చిన శక్తివల్లే ఉపగ్రహాలను, క్షిపణులను కనుగొన్నానని, శరీరం రాలిపోయిన రోజు మళ్లీ ఆమె వద్దకు చేరి ఆమెను సేవించు కుంటానని తన ప్రస్తావనలో రాశారు. మనం చేసే పూజలు, వ్రతాల సంకల్ప సమయంలో 10 తరాలకు అటు, ఇటు మంచి జరగాలని చెప్పుకుంటారు.

స్వామి వివేకానందుడు తన తల్లి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేయకుండా అతిథికి ఎవరికైనా భోజనం పెట్టిన తరువాత తను భోజనం చేసేదని ఆమె సేవాభావన నన్ను ఇంతవాణ్ణి చేసిందని చెప్పుకొని  గర్వపడేవాడు. కనుక పెద్దలు, పూర్వజుల గురించి ప్రతి ఇంట్లోనూ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం ప్రతి యింట ‘మంగళసంవాద్‌’ (శుభాల్ని అందించే చర్చ) కార్యక్రమాన్ని ఎవరి కుటుంబంలో వారే నిర్వహించుకోవాలి. వారానికోసారి ఇంట్లోనివారు అందరూ పిల్లలతో సహా అనుకూల సమయం కలిసి కూర్చోవాలి.

  1. ఓంకారం 3 సార్లు – 2,3 నిమిషాలు.
  2. మౌనంగా కళ్ళు మూసుకొని 30 సెకన్లుండి, కళ్ళు తెరిచి అందరిని ప్రసన్నంగా చూడడం 1 ని॥.
  3. ఒక భజన కానీ, ఒక శ్లోకం కానీ, ఒక పద్యం కానీ, ఒక కీర్తన కానీ ఒకరు చెప్తుంటే మిగిలిన వారు అనడం 3 ని॥లు.
  4. మన కుటుంబం చరిత్ర, వివరాలు, ఇంటి యజమాని వైపు 3 తరాలు, యజమాని భార్య వైపు 3 తరాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎట్లా జీవించేవారు, చెప్పుకోదగ్గ విశేషాలు, మంచి పనులు, పాటించిన విలువలు, సాధించిన విషయాలు.. ఇట్లా తమ కుటుంబం గూర్చి ప్రస్తావనలు 15 ని॥లు. దీని వల్ల అందరిలో తమ కుటుంబం, వంశం పట్ల అభిమానం, గౌరవం, గర్వం పెరుగుతాయి. మర్యాద నిలబెట్టాలని, తప్పులు చేయకూడదనే భావన పెరుగుతుంది. కుటుంబం పటిష్టమవు తుంది.
  5. ప్రతివారం ఏదో విషయంపై చర్చ (సమకాలీన పరిస్థితులు, కుటుంబ విలువలు ఇలా 1 ని॥)
  6. చివరలో శాంతి మంత్రంతో ముగించడం 1ని॥.

ఇలా ప్రతి కుటుంబం వారంలో ఓసారి 35`40 ని॥ల పాటు కూర్చుని చేసేదే ‘మంగళ సంవాద్‌’. ఒకరితో మొదలుపెట్టి, మిత్రులు బంధువుల ఇళ్ళలో, ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్ళలో జరిగేట్టు చూడాలి. కొందరు మన పెద్దలు దానధర్మాలు చేసి ఉండొచ్చు, కొందరు స్వాతంత్య్ర సమరంలో పాల్గొని ఉండొచ్చు, కొందరు గుళ్ళు, గోపురాలు కట్టించి ఉండొచ్చు. అవన్నీ మనకు నిత్య ప్రేరణనిస్తాయి.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *