‘‘రేవా శక్తి అభియాన్’’ తో ఆడ పిల్లల కుటుంబాల్లో మార్పులు తెస్తున్న కలెక్టర్
ఆడపిల్ల విషయంలో ఒక్కో సమాజం, ఒక్కో ప్రాంతం ఒక్కోలా స్పందిస్తుంది. ఒకరు భారంగా భావిస్తే.. మరొకరు అదే ఆడపిల్లను మహా లక్ష్మీలా భావిస్తారు. కానీ వివక్ష మాత్రం ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే వుంటుంది. దీనిని రూపుమాపడానికి వ్యక్తిగతంగా కొందరు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే వున్నారు. అయితే మధ్యప్రదేశ్ లోని హర్దా జిల్లాలో ఆడపిల్లల విషయంలో ఓ ప్రత్యేక కార్యక్రమమే నడుస్తోంది. ఈ పథకం పేరు ‘‘రేవా శక్తి అభియాన్’’.
ఈ కార్యక్రమం ద్వారా ఆడ పిల్లలున్న కుటుంబాలకు ప్రత్యేక కార్డులు అందిస్తున్నారు. దీని ద్వారా అటు ప్రభుత్వంలో, ఇటు ప్రైవేటు సేవల్లో ఆ కుటుంబాలు చాలా లాభాలు ఆర్జిస్తున్నాయి. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని అక్కడి జిల్లా కలెక్టర్ రేవా శక్తి అభియాన్ ను ప్రారంభించారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికలు, మహిళల విషయంలో అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అయితే.. హర్దా జిల్లా కలెక్టర్ ఆదిత్య సింగ్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అసమానతల్ని గుర్తించి, ముందుకెళ్లారు.ఎలాగైనా ఈ వాతావరణాన్ని మార్చేయాలని అనుకున్నారు. ఈ ప్రాంతంలో బాలికల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘రేవా శక్తి అభియాన్’’అనే పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 553 గ్రామాల్లో ఆడపిల్లలున్న ప్రతి ఇంటికీ ‘‘కీర్తి కార్డులు’’ అందిస్తున్నారు. అన్ని కుటుంబాలకూ చేరేలా చూశారు.

ఈ కీర్తి కార్డులు అందుకున్న కుటుంబాలకు పథకం ప్రకారం కొన్ని సౌలభ్యాలిచ్చారు. దుకాణాలు, మాల్స్, ఆస్పత్రులు, హోటల్స్, రెస్టారెంట్లు… ఎక్కడికి వెళ్లినా ఈ కీర్తి కార్డుల ద్వారా డిస్కౌంట్లు అందిస్తోంది ప్రభుత్వం.కొన్నింటిని ఉచితంగా కూడా ఇస్తోంది. అలాగే విద్యా సంస్థల్లో చేరే సమయంలోనూ ఈ కీర్తి కార్డును ఉపయోగించుకొని ఆడపిల్లలకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో ఏ పని వున్నా… ఈ కార్డు తీసుకెళ్తే వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే కీర్తి కార్డులపై క్యూఆర్ కోడ్ కూడా వుంటుంది. దీనిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా కలెక్టర్ చొరవతో అక్కడి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తోంది. దీని ద్వారా తాము చాలా లాభపడుతున్నామని చెప్పుకొచ్చారు.
ఇక… వీటితో పాటు డాటర్స్ క్లబ్ కూడా కలెక్టర్ చొరవతో ఏర్పాటైంది. బేటీ బచావో, బేటీ పఢావో పథకం కింద ఈ డాటర్స్ క్లబ్ ఏర్పాటైంది. ఇందులో భాగంగా అంగన్ వాడీ కార్యకర్తలు, క్లబ్ సభ్యుల సహాయంతో ఆ గ్రామంలోని ఆడపిల్లలున్న కుటుంబాల్ని ఒక దగ్గర చేర్చి, బాలికల గొప్పతనాన్ని వారికి తెలియజేస్తున్నారు. అలాగే చదువు, ఆరోగ్యం, సంక్షేమంపై కూడా అవగాహన ఇస్తుంటారు.దీని ద్వారా హర్దా జిల్లాలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నాయి. ఆడపిల్లల విషయంలో వారి దృక్పథాలు కూడా మారిపోతున్నాయి. అలాగే అమ్మాయిలను చూసే దృష్టికోణం కూడా మారిపోయిందని, మరింత కష్టపడి, వాతావరణాన్ని మారుస్తామని కలెక్టర్ ప్రకటించారు.