దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్.యస్.యస్. పాత్ర

సుదీర్ఘకాలం దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి విజయాన్ని సాధించిన దేశాలలో భారతదేశం ఒకటి. అయితే ఇది ఒకటి, రెండు కుటుంబాల త్యాగాల వల్ల, ఒక్క కాంగ్రెస్ వల్లనే సాధ్యమైందనే భ్రమ కలిగేలా ప్రచారం చేశారు. ఆర్.యస్.యస్. వంటి ప్రముఖ సంస్థగాని, ఆ సంస్థకు చెందిన వ్యక్తులెవరికీ స్వతంత్ర పోరాటంతో సంబంధంలేదని కూడ దుష్ప్రచారం మొదలు పెట్టి పెరుగుతున్న సంఘ శక్తిని నిలిపివేసే ప్రయత్నం చేసి విఫలులైనారు. అది అసత్య ప్రచారమని తేట తెల్లమైంది. తల్లిదండ్రులకు సేవ చేసిన పుత్రులు గుర్తింపు కోరుకోరు. భవనం క్రింద ఉండే పునాది రాయి కనిపించాలనుకోదు. సరిగ్గా దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్.యస్.యస్. కూడ అటువంటి పాత్రనే పోషించింది, అయితే సత్యం గెలుస్తుంది. గెలవాలి కూడ. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్.యన్.యన్. ఎటువంటి భూమికను పోషించిందో సంక్షిప్తంగా తెలియజెప్పడమే యీ వ్యాసము యొక్క ప్రధానోద్దేశ్యము.

డాక్టర్జీ స్వాతంత్ర సమర యోధుడు :-

ఆర్.యస్.యస్.ను ప్రారంభించిన డాక్టర్ కేశవబలిరాం హెడ్గేవార్ జన్మజాత దేశభక్తుడు. పుట్టుకతోనే దేశభక్తి లక్షణాలున్నాయని అయన జీవనమే తెలియజేస్తోంది. 1906లో డాక్టర్జీ నాగపూర్ లో నీల్సిటీ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో వందేమాతరం నినాదాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రిస్లే సర్కులర్ ద్వారా నిషేధిస్తూ ఉత్తర్వులిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాలలో వందేమాతరం నినాదాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రతిధ్వనింపజేసి పాఠశాల బహిష్కరణకు గురయ్యారు. మెడిసిన్ చదవడానికి కోల్కతా వెళ్ళినప్పుడు అనుశీలన సమితిలో చేరి కొకైన్ అనే మారుపేరుతో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్య్రం కోసం పోరాడారు. త్రైలోక్యనాథ చక్రవర్తి అనే విప్లవ వీరుడు రాసిన “జైల్ మే తీస్ ఐరస్” అనే పుస్తకంలో మరిన్ని వివరాలు లభిస్తాయి. మెడిసిన్ చదువు పూర్తయ్యాక వివాహం చేసు కోకుండా ప్రాక్టీస్ చేయకుండా దేశకార్యం కోసం జీవితాన్ని అంకితం చేసుకొని స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడాయన. ఆ రోజుల్లో అందరూ జాతీయ కాంగ్రెస్ సంస్థ ద్వారానే పోరాటం చేస్తుండేవారు. డాక్టర్జీ నాగ్పూర్ నగర కాంగ్రెస్కు సహ కార్యదర్శి పదవి చేబట్టి 1920లో నాగపూర్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆ సమావేశాల్లో సంపూర్ణ స్వరాజ్యం కోరుతూ తీర్మానం చేయాలని ప్రతిపాదించిన జాతీయ కాంగ్రెస్ నాయకుడాయన. గాంధీజీ పిలుపు నిచ్చిన సహాయ నిరాకర జోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించారు. 1922లో మధ్య పరగణాల సంయుక్త రాష్ట్రాలకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సహ కార్యదర్శిగ యెన్నికయ్యారు డాక్టర్ హెడ్గేవార్.

సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానం-సంఘం పాత్ర:-

డాక్టర్జీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడం, వచ్చిన తరువాత దానిని సంరక్షించుకోవడం అనే రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆర్.యస్.యస్.ను స్థాపించారు. ఇందులో సకారాత్మకతే కాని నకారాత్మకత లేదు. సమాజ సంఘటన ప్రధానం అనుకున్నారు. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశాల్లో సంపూర్ణ స్వాతంత్ర్యానికి, 26 జనవరి 1930 స్వాతంత్య్ర దినంగా పాటించాలని రెండు తీర్మానాలు చేశారు డాక్టర్ హెడ్గేవార్ స్వయంసేవకులు జనవరి 30న ఉదయం 6.00 గంటలకు సంఘశాఖల్లో సమావేశమై తీర్మానాలకు సంపూర్ణ మద్దతు తెలపాలని వెంటనే సూచన పంపించారు.

దండి సత్యాగ్రహంలో సంఘం :-

1930లో గాంధీజీ దండి సత్యాగ్రహం ద్వారా సహాయనిరాకరణోద్యమానికి పిలువు నిచ్చినప్పుడు సంఘం మద్దతు తెలిపింది. దేశ నాయకులందరూ సంఘాన్ని ప్రశంసించారు. డాక్టర్జీ తన సరసంఘచాలక్ బాధ్యతలను డా॥వరాంజపే గారికి అప్పగించి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వారితో పాటు అప్పాజీ జోషి, దాదారావు పరమార్థే, వాంఖడే, ఘరోటే, అంబాడే మొ॥ అనేకమంది కార్యకర్తలు, స్వయం సేవకులు పాల్గొన్నారు. సమాజం కోసం సంఘం పనిచేస్తుంది. స్వయంసేవకులు స్థానిక సంఘచాలక్ అనుమతితో స్వాతంత్ర్యో ద్యమంలో పాల్గొనాలని నిర్ణయించారు. 1937 డిసెంబర్లో ఫైజాపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో జెండా ఎగురవేస్తున్నప్పుడు 80 అడుగుల ఎత్తులో ఆగిపోతే అందులో పాల్గొన్న కిషన్సింగ్ పరదేశి అనే స్వయంసేవక్ ధైర్యంగా స్తంభాన్ని ఎక్కి చిక్కుదీసి జెండా ఎగిరేలా చేశాడు. డాక్టర్జీ అతనిని సన్మానించారు.

బ్రిటిష్ వారిని గడగడలాడించిన సంఘం:-

స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న ఆర్.యస్.యస్.ను అడ్డుకోవాలని 1932, 33 సం॥రాల్లో బ్రిటిష్ ప్రభుత్వం సంఘం మత సంస్థ అని, ప్రభుత్వోద్యోగులెవరూ ఆర్.యస్.యస్.లో పాల్గొన కూడదని ఉత్తర్వులు జారీచేస్తే వలసవాద మనస్తత్వం కలిగిన నేటి కాంగ్రెస్ రాజకీయ పార్టీ నేటికీ దానినే ప్రచారం చేస్తోంది. అయితే ఆనాడే మధ్యప్రాంత అసెంబ్లీ సమావేశాల్లో బాబా సాహెబ్ కోల్టే ఆర్.యస్.యస్. ను సమర్థిస్తూ ప్రతిపాదన చేస్తే అన్ని వర్గాల కాంగ్రెస్ నాయకులు, రహమాన్ లాంటి సభ్యులు కూడ దానిని సమర్ధించారు. సర్వేషా మవిరోధేనా అనే తీరులో సంఘ పని నడుస్తూ వస్తోంది.

సాండర్స్ హత్య తరువాత అజ్ఞాతంలో ఉన్న రాజ్కురుకు డాక్టర్జీ వసతి యేర్పాట్లు కల్పించారు. స్వయంసేవకులు సంఘంలో చేసే ప్రతిజ్ఞలో హిందూరాష్ట్ర స్వాతంత్య్రం కోసం నేను కృషి చేస్తాను అని ఉండేది. అయితే స్వాతంత్ర్యం వచ్చాక ఆ వాక్యాన్ని దేశ సర్వాంగీణ ఉన్నతిని సాధించడం కోసం అని మార్చారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో దేశ పౌరులుగా స్వయంసేవకులు ఉద్యమంలో పాల్గొన వచ్చునని గురూజీ గోళ్వల్కర్ పిలుపు నిచ్చారు. వేలాది మంది స్వయంసేవకులు ఉద్యమంలో పాల్గొని పోరాడారు. అప్పటికి ఆర్.యస్.యస్. బలంగా ఉన్న చోట విదర్భ ప్రాంతంలో ఉద్యమం జోరుగా సాగింది.

ఆర్.యస్.యస్. కార్యకర్తలు దాదానాయక్, బాబారావ్ భగడే, అన్నాజీలు నాయకత్వం వహించిన చిమూర్ ఉద్యమం గురించి బెర్లిన్ రేడియో కూడ వార్త ప్రసారం చేసింది. బాలాజీ రాయపూర్కర్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. 125 మంది సత్యాగ్రహులకు జైలు శిక్ష వేశారు. దాదానాయక్ కు ఉరిశిక్ష పడితే తరువాత జైలు శిక్షగా మారింది. వారందరూ స్వయంసేవకులే. ఉద్యమాన్ని అణచి వేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ సైనిక బలగాలను తరలిస్తుంటే స్వయం సేవక్ హేమూకలానీ నాయకత్వంలో రైలు పట్టాలకు ఫిష్ ప్లేట్లను తొలగించి ఉరికంబమెక్కారు.

క్విట్ ఇండియా ఉద్యమం-ఆర్. యస్. యస్. పాత్ర:-

క్విట్ ఇండియా ఉద్యమంలో దేశవ్యాప్తంగా సీనియర్ స్వయంసేవకులు పాల్గొన్నారు. వారిలో అన్నా సాహెబ్ దేశ్ పాండే, (విదర్భ), రమాకాంత్ కేశవ్ (చత్తీస్ గఢ్), శ్రీ వసంత రావ్ ఓక్ (ఢిల్లీ ప్రాంత ప్రచారక్), నారాయణసింగ్ ఉపాఖ్య బాబూజీ (బీహార్), చంద్రకాంత్ భరద్వాజ్లున్నారు. రమాకాంత్ దేశ్పాండే తరువాత యస్.టి.ల అభ్యున్నతి కోసం వనవాసి, కళ్యాణాశ్రమాన్ని స్థాపించారు. సంఘప్రచారక్లు, భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ కూడ పాల్గొని అరెస్టైనారు.

1942 ఆగష్టు 11న పాట్నా ప్రభుత్వ సచివాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో బ్రిటిష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో దేవీపాద్ చౌదరి, జగపతి కుమార్ అనే ఇద్దరు స్వయంసేవకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ ప్రాంత మొదటి సంఘచాలక్లు బాబూజీ, సీనియర్ జర్నలిస్టు కృష్ణకాంత్ ఓఝాలు కూడ అందులో పాల్గొన్నారు.

అజ్ఞాతంలో ఉన్న నేతలకు ఆశ్రయం:- ఢిల్లీలో సంఘచాలక్ లాలా హంసరాజ్ ఇంట్లో అరుణా అసఫలీ 15 రోజుల పాటు ఆశ్రయం పొందారు. హంసరాజ్ గారి భార్య ఇచ్చిన దుస్తులు ధరించి పెండ్లి ఊరేగింపులో భాంగ్రా నృత్యం చేస్తూ తప్పించుకొని వెళ్ళిపోయారు. అవధ్ సంఘచాలక్ శ్రీపాద దామోదర సాత్వలేకర్ ఇంట్లో విప్లవకారుడు నానా పాటిల్, వీరి సహచరుడు కృష్ణవీర్ సతారా సంఘచాలక్ ఇంట్లో, సంఘ విమర్శకుడు, గాంధీజీ అనుయాయి సానే గురూజీ పూనా సంఘచాలక్ ఇంట్లో ఆశ్రయంపొందాడు. సోషలిస్టు నాయకుడు అచ్యుత పట్వర్ధన్ అనేక మంది స్వయంసేవకుల ఇళ్ళల్లో తలదాచుకున్నాడు. వసంత దాదా పాటిల్ను వస్తాదు అయిన పదసల్గికర్ అనే స్వయంసేవక్ వీపుపై మోసుకొని పొలాలగుండా విశ్రమ్ బాగ్ రైలు స్టేషన్‌కు చేర్చి తప్పించారు.

1942 ఏప్రిల్లో పూనాలో జరిగిన సంఘ శిక్షణా శిబిరంలో గురూజీ గోళ్వల్కర్ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారికి సహకరిస్తున్న వాళ్ల ధోరణిని తీవ్రంగా ఖండించారు. దేశకార్యం కోసం స్వయంసేవకులు ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ దేశం నుండి బ్రిటిష్ వారిని తరిమివేయడం, దేశానికి స్వాతంత్య్రం సాధించడచమే ఆర్.యస్.యస్. లక్ష్యంగా కనిపిస్తోందని 1943 నాటి బ్రిటిష్ ఇంటెలిజన్స్ నివేదిక సమర్పించింది. దీనిని బట్టి బ్రిటిష్ పాలనను ఆర్.యస్.యస్. ఎంతగా వ్యతిరేకించిందో స్పష్టమవుతోంది. ఈనాడు కాంగ్రెస్ వారు ఆర్.యస్.యస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారం గాలిలో కలిసిపోక తప్పదు. క్విట్ ఇండియా ఉద్యమానికి కమ్యూనిష్టులు దూరంగా ఉండి ఈ దేశానికెంతో ద్రోహం చేశారు.

దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్.యస్.యస్. పాత్ర లేదన్నది శుద్ధ అబద్ధమని చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది. బ్రిటిష్ రికార్డుల్లో ఆర్.యస్.యస్. పోరాటం గురించి ఉంది. అయితే భారతదేశంలో ఉన్న జాతీయవాద వ్యతిరేక చరిత్రకారులు, సంఘ వ్యతిరేకులు సంఘం నిర్వహించిన పాత్రను చరిత్రలో కెక్కించకుండా జాగ్రత్త వహించాయి. చరిత్రను మసిపూసి మారేడు కాయ చేశారు. చరిత్రను వక్రీకరించారు. కాబట్టి చారిత్రక వాస్తవాలు మరుగున వడ్డాయి. ఇప్పుడిప్పుడే నిజమైన చరిత్ర బయట పడుతోంది. ప్రజలు సత్యాన్ని గుర్తిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి అధిష్ఠాన దేవత భారతమాత. భారతదేశం కోసం సర్వస్వాన్ని సమర్పించు కోవడానికి స్వయంసేవకులు సర్వదా సన్నద్ధంగా ఉంటారు. ఆ సర్వ సన్నద్ధతతోనే స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారతాన్ని సంరక్షించుకోవడంలో ఇక ముందు కూడ అటువంటి భూమికనే సంఘం పోషిస్తుంది. జాతీయ పతాకమన్నా జాతీయ గీత మన్నా భారత రాజ్యాంగమన్నా ఆర్.యస్.యస్.కు అత్యంత గౌరవము, వాటి గౌరవమే తమ గౌరవంగా భావిస్తుంది.

-డా. అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం – స్ఫూర్తి పత్రిక సంపాదకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *