చైనా రంగులను ‘‘ఛీ’’ కొడుతున్న జనం… హోళీకి భారత ఉత్పత్తులకు భలే గిరాకీ
రానూ రానూ దేశ ప్రజల్లో స్వదేశీ భావన పెరుగుతోంది. స్వదేశీ వస్తువులకి కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న ఉత్పత్తుల వైపు తొంగి కూడా చూడటం లేదు. దీపావళి పటాకుల విషయంలో చైనాకి భారతీయులు భారీ ఝలకే ఇచ్చారు. కోట్లలో చైనా నష్టపోయింది. మన దేశంలో తయారైన టపాకాయలనే ప్రజలు కొనుగోలు చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశారు.
సరిగ్గా ఇదే స్వదేశీ భావన హోళీ పండుగ సందర్భంగా కూడా వచ్చింది. వ్యాపారులు చైనా తయారు చేసిన రంగులను బహిష్కరిస్తున్నారు. దీంతో దాదాపు చైనాకి రంగు పడింది. దేశీయంగా తయారు చేసిన రంగులు, స్వీట్లకు మార్కెట్లలో విపరీతంగా డిమాండ్ పెరిగింది. చైనా వస్తువులను దాదాపుగా బహిష్కరించేస్తున్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతోంది.
కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ… గత యేడాది హోళీ సమయంలోనూ ట్రేడర్స్, ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించారని గుర్తు చేశారు. వాటి స్థానే భారత్ లో తయారైన కలర్లు, గులాల్, వాటర్ గన్స్, బెలూన్లు, పూజా వస్తువులతో పాటు మిగిలిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
వీటితో పాటు స్వీట్లు, డ్రైఫ్రూట్స్, పూలు, పండ్లు, ఇతర వస్తువులకు కూడా విపరీతమైన గిరాకీ వుందన్నారు. భారతీయ వస్తువులకే బాగా గిరాకీ వున్న నేపథ్యంలో మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ పెరిగిందన్నారు.
అలాగే ప్రజలు టీషర్టులు, కుర్తా, పైజామా, సల్వార్ సూట్స్ కూడా అడుగుతున్నారని, కేవలం భారత్ లో తయారైన వాటినే అడుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వాటిపై ‘‘హోళీ శుభాకాంక్షలు’’ అని రాసి వుండాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయన్నారు.
భారత్ లో జరిగే ప్రతి పండుగ సమయంలో వ్యాపారం విపరీతంగా జరుగుతుందన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందన్నారు. హోళీ పండుగ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజితం చేస్తోందని, దీంతో చిన్న తరహా పరిశ్రమలు, కార్మికులు విపరీతమైన ప్రయోజనాన్ని పొందుతున్నాని పేర్కొన్నారు. గతంలో చైనా నుంచి తయారైన వస్తువులు కూడా వుండేవని, అవి కూడా అమ్ముడు పోయేవన్నారు. కానీ… ఇప్పుడు కేవలం భారతీయ వస్తువులనే అడుగుతున్నారన్నారు. ఈ హోళీ పండగ చాలా మంది వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చుతోందన్నారు.
CAIT డేటా ప్రకారం ఈ సంవత్సరం హోళీ పండుగ సందర్భంగా 60,000 కోట్లకు పైగా వ్యాపారం నడుస్తోందని తేలింది. గత యేడాది 50వేల కోట్లు జరిగిందని, ఈ సారి 20 శాతం ఎక్కువ జరిగిందన్నారు. ఒక్క ఢిల్లీలో మాత్రమే 8,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని తెలిపింది. అలాగే బ్యాంకెట్ హాళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ పార్కులు కూడా హోళీ కోసం ఎక్కువగా బుక్కయ్యాయన్నారు. ఒక్క ఢిల్లీలోనే 3,000 కి పైగా హోళీ మిళన్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలలో హోళీ పండుగ చేసుకోవాలని, అంతేకాకుండా దేశీయంగా తయారైన కలర్లనే వాడాలన్న స్పృహ కూడా విపరీతంగా పెరిగిందన్నారు.