హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలి : అరుణ్ కుమార్
భారతీయ భాషలన్నీ జాతీయ భాషలేనని, ప్రతి రాష్ట్రమూ తన భాషను ప్రోత్సహించాలని ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ్ అరుణ్ కుమార్ అన్నారు. అధికారిక వ్యవహారాలన్నీ అధికార భాషలోనే జరగాలని ఆయన అన్నారు. భారత్ లో ఏ భాషా ప్రాంతీయ భాష కాదని తేల్చి చెప్పారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అరుణ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రతి భాషా జాతీయ భాషే. భాషపై వివాదం చెలరేగడం అత్యంత దురదృష్టకరం’’ అని అన్నారు.
ప్రతి రాష్ట్రం కూడా తన భాషను బాగా అభివృద్ధి చేసుకోవాలని, అధికారిక కార్యకలాపాలన్నీ ఆయా రాష్ట్రాల భాషల్లోనే జరగాలన్నారు. ఇప్పటికే ఓ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వుందని, ఉమ్మడి జాతీయ భాష అనేది కావాలన్నారు. అయితే… ఒకానొక దశలో సంస్కృత భాషే కానీ… అది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి, హిందీని ఉమ్మడి జాతీయ భాష చేయాలని సూచించారు. హిందీ వద్దనుకుంటే మరో భాషను చేయాలన్నారు. ఇంగ్లీషు మాత్రం ఉమ్మడి జాతీయ భాష కాదని, అది విదేశీ భాష అవుతుందని తేల్చి చెప్పారు. ఇదే విషయంపై ఆరెస్సెస్ ద్వితీయ సరసంఘచాలక్ గురూజీ తమిళనాడులో పర్యటిస్తున్న సమయంలోనూ అడిగారని గుర్తు చేశారు. ఒకవేళ ఆంగ్లాన్ని జాతీయ ఉమ్మడి భాషగా పేర్కొంటే.. మన భాషల అస్తిత్వం ఇబ్బందుల్లోకి పడిపోతుందని గురూజీ పేర్కొన్నారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు.