ఆరెస్సెస్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు : సంఘ్ హెచ్చరిక

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పని తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆరెస్సెస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించిన వ్యవహారంలో ఆరెస్సెస్ కార్యకక్తలను, సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ కార్యకర్తలు, ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ తో ఆర్థిక లావాదేవీలు వున్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాంటూ అసత్య ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు అల్లి, కొన్ని మీడియా సంస్థలు వాస్తవ విరుద్ధమైన అంశాలను ప్రచారం చేయడాన్ని ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతం తీవ్రంగా ఖండించింది.

సమాజంలో నిరంతరం నిస్వార్థంగా, ప్రజా సేవలో నిమగ్నమయ్యే లబ్ధ ప్రతిష్ఠ కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆరెస్సెస్ ఆక్షేపించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘ్ ని, కార్యకర్తలను బద్నాం చేయాలని చూస్తే వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.

బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆరెస్సెస్ కి సంబంధం లేదు..

బీజేపీ అంతర్గత, సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు, ఇక్కడి బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వమే పర్యవేక్షిస్తుందని ఆరెస్సెస్ తెలిపింది. అలాగే సమన్వయం కూడా ఆ పార్టీ అధిష్ఠానమే చేస్తుందని, ఈ విషయంలో ఆరెస్సెస్ తెలంగాణ శాఖకి ఎలాంటి సంబంధం లేదని, ప్రత్యక్ష జోక్యం కూడా వుండదని పునరుద్ఘాటించింది. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణా రహితంగా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్ కి, సంఘ్ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు వున్నాయని, అందుకే ఆయన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైన తప్పుడు కథనాలను ఇస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కథనాలను ఆరెస్సెస్ కి అంటగడుతూ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూడటం దురదృష్టకరమని పేర్కొంది. మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని, లేని పక్షంలో ఆ వ్యక్తులపై చట్ట ప్రకారం, న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని ఆరెస్సెస్ తెలంగాణ తేల్చి చెప్పింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *