శక్తిమంత భారత్ నిర్మాణమే సంఘ్ లక్ష్యం : మోహన్ భాగవత్

ముందస్తుగా ఏర్పర్చుకున్న అభిప్రాయాల ఆధారంగా కాకుండా, పనిగట్టుకొని చేసే ప్రచారం ఆధారంగా సంఘ్ పై ఓ నిర్ణయానికి రావొద్దని యువతకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ విజ్ఞప్తి చేశారు. సంఘ్ పనిని, కార్యకలాపాలను, సామాజిక పాత్రను నిశితంగా అర్థం చేసుకోవాలని సూచించారు. శక్తిమంతమైన భారతాన్ని నిర్మించడమే సంఘ్ లక్ష్యమని పునరుద్ఘాటించారు.గౌహతిలోని బారాబరిలోని సుదర్శనాలయంలో జరిగిన యువ సదస్సులో మోహన్ భాగవత్ ప్రసంగించారు.ఈ సందర్భంగా సంఘ్ విధానాలు, ఆదర్శాలు, ప్రవర్తనా నియమావళి, సంస్థకు సంబంధించిన కొన్ని విషయాలను వారికి వివరించారు. ప్రస్తుతం సంఘ్ అనేది అందరి నోళ్లల్లోనూ నానుతోందని, కానీ.. సత్యం, వాస్తవాల ఆధారంగా సంఘ్ పై చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు.
ఓ దేశ పురోగతి అనేది సమాజ పురోగతితోనే ముడిపడి వుందని,ఏకాత్మత, ధర్మంతో సుసంపన్నమైన సమాజం మాత్రమే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలదన్నారు.ఇక.. అభివృద్ధి చెందిన దేశాలను ఉదాహరణగా చూపిస్తూ, వారి పురోగతి అంతా కూడా ఐక్యత, నాణ్యత ఆధారంగానే సమాజం అభివృద్ధి చెందిందన్నారు. మన దేశం కూడా ఆ దిశగానే ముందుకు సాగాలని, భాషా, ప్రాంతీయ, విశ్వాసం, వైవిధ్యత అనేది మన బలమని, ఈ వైవిధ్యాన్ని గౌరవించడం భారతీయ సంస్కృతి ముఖ్య లక్షణమని వివరించారు.
భారతదేశంలో ఈ వైవిధ్యాన్ని గౌరవించే వారు హిందువులు, మరియు అటువంటి హిందూ సమాజాన్ని నిర్వహించడమే సంఘ్ లక్ష్యమని వివరించారు. వ్యవస్థీకృత సమాజం, ధర్మబద్ధం ఆధారంగా జీవించడం అయ్యే వరకూ దేశ భాగ్య రేఖలు మారవని స్పష్టం చేశారు.,గురునానక్ దేవ్, శ్రీమంత శంకర్ దేవ్ వంటి గొప్ప వ్యక్తుల ఉదాహరణలను ఆయన ఉటంకిస్తూ, వారందరూ భిన్నత్వాన్ని గౌరవిస్తూ సమాజానికి ఐక్యత సందేశాన్ని అందించారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *