ఫలితాల విశ్లేషణలో మునిగిపోకుండా ఇక.. పనిలో మునిగిపోవాలి: మోహన్ భాగవత్
ఎన్నికలు విజయవంతంగా ముగిసి, వాటి ఫలితాలు కూడా వచ్చేశాయని, ప్రక్రియ అంతా ముగిసినా… వాటి గురించే ఇంకా చర్చ జరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఇన్ని రోజుల ఎన్నికల ప్రక్రియ ఏదైతే జరిగిందో… అది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది.. ఏం జరిగింది? అని ఇంకా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొత్త ప్రభుత్వం కూడా అధికారం చేపట్టిందని, ఇక ఆ విషయంతో సంఘ్‌కి ఎలాంటి సంబంధం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుంటామని అన్నారు. నాగపూర్‌లో కార్యకర్త వికాసవర్గ సమాపన్ ఉత్సవం సందర్భంగా మోహన్ భాగవత్ ప్రసంగించి స్వయం సేవకులకు మార్గనిర్దేశనం చేశారు. ప్రతి ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు సంఘ్ పనిచేస్తుందని, ఫలితాల విశ్లేషణలో మునిగిపోకుండా ఇక.. పనిలో మునిగిపోవాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎన్నికల ప్రచార సమయంలో పలు వివాదాలు చోటు చేసుకున్నాయని, వివాదాలకు దూరంగా వుండడానికి సదరు నేతలు జాగ్రత్తలు మాత్రం తీసుకోలేకపోయారని అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లాంటి వ్యవస్థను కూడా ఈ విమర్శల్లోకి లాగారని సర్‌సంఘ్‌చాలక్ అన్నారు. సమాజంలో పనిచేస్తున్న సమయంలో సంఘ్ ఎప్పుడూ గౌరవంగానే మసులుకుందని, అగౌర స్థాయిలో ఎన్నడూ లేదని, ఎవ్వరినీ నొప్పించలేదని కూడా అన్నారు. ఎన్నికల సందర్భంలో పోటీ అనివార్యంగా వుంటుందని, ప్రత్యర్థులను వెనక్కి నెట్టడం కూడా అంతే సహజమని, కానీ దానికి కూడా ఓ పరిమితి అంటూ వుంటుందని అన్నారు. నాణేనికి రెండు వైపులు వున్నట్లుగానే పార్లమెంట్‌లో కూడా ఇరు పక్షాలు వుంటాయని, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు రెండు వైపులా చూసే ధృక్కోణం ఉండాలని అన్నారు. అధికార పక్షం ఓ నాణేన్ని ప్రస్తావిస్తే, ప్రతిపక్షం మరో వైపు వున్న నాణేన్ని ప్రస్తావించాలన్నారు. తద్వారానే సరైన నిర్ణయానికి రావొచ్చని అభిప్రాయపడ్డారు.
అయితే విపరీతమైన పోటీ వున్న ఈ ప్రక్రియలో ఏకాభిప్రాయం కష్టమని మోహన్ బాగవత్ పేర్కొన్నారు. అందుకే మెజారిటీపైనే ఆధారపడాల్సి వుంటుందన్నారు. పోటీ అంతా మెజారిటీ కోసమేనని, ఇది కేవలం పోటీ మాత్రమేనని, దానిని యుద్ధంగా చూడరాదని అన్నారు. కానీ… ఎన్నికల సమయంలో ఓ గౌరవ సూచీని దాటి విమర్శలకు దిగారని, దీని ద్వారా సమాజంలో విభజన రేఖలు వచ్చేశాయని, సామాజికంగా, మానసికంగా కూడా విభజన వచ్చేట్లు చేశారని ఆవేదన చెందారు. సాంకేతికతను ఉపయోగించి, అసత్యాన్ని, పుకార్లను వ్యాప్తి చేశారని, సాంకేతికత, విజ్ఞానం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
ఇక ఆర్థిక రంగంలోను, రక్షణ, క్రీడలు, సంస్కృతి, సాంకేతికత తదితర రంగాల్లోను భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని మోహన్ భాగవత్ ప్రశంసించారు. అయితే.. దేశంలోని సవాళ్లన్నింటినీ అధిగమించేసినట్లు కాదని అన్నారు. దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని, ఎన్డీయే కూటమి తిరిగి పగ్గాలు చేపట్టిందని అన్నారు. గత పదేళ్లలో ఎన్నో మంచి పనులు జరిగాయని, ఇది వాస్తవమేనని తెలిపారు. ప్రపంచ అభివృద్ధి కొలమానం ప్రకారం భారత ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతోందని, మన రక్షణ సంసిద్ధత మునుపటి కంటే కచ్చితంగా మెరుగుపడిందని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రతిష్ఠ కూడా పెరిగిందని, కళ, సంస్కృతి, సైన్స్, క్రీడలు మొదలైన రంగాలలో చాలా అభివృద్ధి సాధించామని, ప్రపంచ దేశాలు కూడా భారత్‌ను గుర్తించడం ప్రారంభించాయని చెప్పారు.
ప్రపంచంలో సమాజం అంతా మారిపోయిందని, దాని ఫలితంగా మార్పులు కూడా వచ్చేశాయని తెలియజేశారు. అయితే.. ఏదైనా పెద్ద పరివర్తన కోసం ఆధ్యాత్మిక పునరుజ్జీవనం అవసరమని, దీనిని అంబేద్కర్ కూడా నొక్కి చెప్పారని గుర్తు చేశారు. మరోవైపు కొన్ని రోజుల పాటు అట్టుడికిన మణిపూర్‌లో ఇప్పుడు శాంతి, ప్రశాంతత నెలకొందని సంతృప్తి వ్యక్తం చేశారు. మణిపూర్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమయం వచ్చేసిందని, అక్కడ వుండే తుపాకీ సంస్కృతికి ముగింపు పలకాలని అన్నారు. ఇక… కొందరు తమ మతాలు మాత్రమే సరైనవని, ఇతరులవి సరికావన్న దృక్పథంలో వుంటారని, ఇలాంటి మనస్తత్వాన్ని మాత్రం తొందరగా వదిలించుకోవాలని ఉద్బోధించారు.ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా గోదావరి ధామ్ పీఠాధిపతి రామగిరి మహారాజ్ విచ్చేశారు. స్వయం సేవకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.