మణిపూర్ అల్లర్లను ఖండించిన ఆరెస్సెస్… పరిస్థితిని చక్కదిద్దాలని సూచన
మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మణిపూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని కోరింది. ఈ ఘర్షణలో అమాయ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదో మానవతా సంక్షోభంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అల్లర్లను తీవ్రంగా ఖండించింది. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలను అపహరించడం, నిర్బంధించడం, హత్య చేయడాన్ని నిరసించింది. ఈ చర్యలు పిరికితనం అని అభివర్ణించింది. అలాగే శాంతియుత సహజీవనానికి కూడా ఇవి విరుద్ధమని పేర్కొంది.
ఈ అల్లర్లను తక్షణమే చిత్తశుద్ధితో పరిష్కరించాలని పిలుపునిచ్చింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందని మరోసారి గుర్తు చేసింది. ఈ ఘర్షణ, ఆందోళనకర పరిస్థితులను వెంటనే అదుపులోకి తేవాలని, శాంతిని పునరుద్ధరించాల్సిన చర్యలు చేపట్టాలని నొక్కి చెప్పింది. ఈ రక్తపాతాన్ని అంతం చేయడానికి అన్ని వర్గాల మధ్య చర్చలు, పరస్పర అవగాహన అవసరమని అభిప్రాయపడింది. సంఘర్షణలకు గల మూల కారణాలను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించింది. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని సంఘ్ తన ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది.
మణిపూర్ లో మళ్లీ హింస రేగింది. ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలఇళ్లకు అల్లరి మూకలు నిప్పు పెట్టారు. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పంటించారు.అలాగే సీఎం బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. అయితే అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నా దాడులు జరుగుతున్నాయి. మణిపూర్‌లోని జిరిబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి హతమార్చడం, వారి మృతదేహాలు కూడా కనిపించాయి.
ఇళ్లల్లోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాకిక్షంగా కాలిపోయినట్లు తెలిపారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూను విధించింది. ఏడు జిల్లాల్లో మొబైల్ సర్వీస్‌లు, ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.
మైతేయ్ తెగకు చెందిన ఆరుగురిని మిలిటెంట్లు ఇటీవల ఊచకోత కోయడం, ఆగ్రహోదగ్రులైన ఆందోళనకారులు శనివారంనాడు పలువురు మణిపూర్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, హింసాకాండకు దిగడంతో తాజా పరిస్థితిని కేంద్రం ఆదివారంనాడు సమీక్షించింది. హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం నార్త్ బ్లాక్‌లో సమగ్ర సమీక్షను సైతం హోం మంత్రి నిర్వహించారు. అక్కడి పరిస్థితులపై సమీక్షించారు.