ఖైరతాబాద్ వినాయకుడి ముందు ఆరెస్సెస్ ‘‘ఘోష్ ప్రదర్శన’’
అత్యంత ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేషుడి ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 50 మంది ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ ఘోష్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఘోష్ వాయిద్యాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగింది. పూర్తి గణవేష ధారులై స్వయంసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ భక్తి గేయాలు, భక్తి గీతాలతో సంఘ్ ఖైరతాబాద్ గణేషుడికి ‘‘స్వర నీరాజనం’’ సమర్పించింది. ఆరెస్సెస్ ఘోష్ ప్రదర్శన జరుగుతోందని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, ఘోష్ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ స్వయంసేవకులకు ఆత్మీయంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా స్వయంసేవకులు ఆలాపించిన వంశీ వాయిద్యం అందర్నీ ఆకర్షించింది.